సైబర్ సెక్యూరిటీ కోర్సులో ప్రవేశం రాకపోవడంతో ఐఐటీ కాన్పూర్ వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసిన ఓ విద్యార్థికి ఆ సంస్థ ఊహించని అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది. వెబ్‌సైట్‌లో ‘Site is Hacked, All I Need Is Just a Fair Chance’ అనే సందేశాన్ని ఉంచిన అతడు, తర్వాత ఎక్స్, రెడ్డిట్‌లో తానే హ్యాకింగ్ చేసినట్లు వెల్లడించాడు. తన ఉద్దేశం నష్టం కలిగించడం కాదని, సైబర్ సెక్యూరిటీ నైపుణ్యాన్ని చూపించడమేనని పేర్కొన్నాడు.
ఈ ఘటనపై స్పందించిన ఐఐటీ కాన్పూర్ డైరెక్టర్ మనీంద్ర అగర్వాల్.. ప్రవేశ ప్రక్రియ పూర్తయిందని, ఇప్పుడు అడ్మిషన్ ఇవ్వడం సాధ్యం కాదని చెప్పారు. అయితే విద్యార్థి భవిష్యత్తు దెబ్బతినకూడదనే ఉద్దేశంతో సీ3ఐహబ్ (C3iHub)లో ఇంటర్న్‌షిప్ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది మళ్లీ ప్రవేశానికి ప్రయత్నించాలని సూచించారు.
మొదట ఈ ఘటనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలనే ఆలోచన చేసినా, తర్వాత అతడి ప్రతిభను ప్రోత్సహించే నిర్ణయం తీసుకున్నట్లు ఐఐటీ వెల్లడించింది. అయితే అనుమతి లేకుండా వెబ్‌సైట్లను హ్యాక్ చేయడం అవకాశాలు పొందేందుకు సరైన మార్గం కాదని స్పష్టం చేసింది. సైబర్ సెక్యూరిటీలో నైపుణ్యం ఉన్న వారు చట్టబద్ధ మార్గంలో దరఖాస్తు చేసుకుంటే ఇంటర్న్‌షిప్‌లు, ఉద్యోగ అవకాశాలను పరిశీలిస్తామని తెలిపింది.
ఐఐటీ వెబ్సైట్ హ్యాక్ చేసి మరీ అవకాశం కొట్టేసిన విద్యార్థి!
