నీట్ పేపర్ లీక్ వివాదంపై కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిర్వహించిన దేశవ్యాప్త నిరసనలు భారతీయ జనతా పార్టీలో కొత్త తలనొప్పికి కారణమవుతున్నాయి. పలువురు బీజేపీ నేతల కుమార్తెలే ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పుతూ విద్యార్థుల ఆందోళనలకు బాహాటంగా మద్దతు తెలుపుతున్నారు. తాజాగా ఈ జాబితాలోకి ఉత్తరప్రదేశ్‌ బీజేపీ మాజీ ఎమ్మెల్యే విక్రమ్ సింగ్ కుమార్తె, కంటెంట్ క్రియేటర్ అయిన యశస్వినీ రాజే సింగ్ చేరారు.

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనల్లో పాల్గొన్న యశస్వినీ, అల్ జజీరాతో మాట్లాడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కొత్త విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని ఒక "నీరసమైన జోక్" అని అభివర్ణించారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను పశ్చాత్తాప చర్యగా కాకుండా, ఒక త్యాగంగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. తాను ఆర్థికంగా స్వతంత్రురాలినని, తన తండ్రి రాజకీయాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆమె స్పష్టం చేశారు.

యశస్వినికి ముందే, బీజేపీ ఎంపీ అపరాజితా సారంగి కుమార్తె అర్చిత సచిన్ రహర్.. ప్రధాన్ రాజీనామాను స్వాగతిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో "నా కుటుంబం డీపీ (ధర్మేంద్ర ప్రధాన్)తో ఉంది, కానీ నేను విద్యార్థులతో ఉన్నాను" అని పెట్టిన పోస్ట్ వైరల్ అయింది. ఆ తర్వాత ఆమె ఖాతా కనిపించకుండా పోయింది. ఇదేవిధంగా, అసోం మంత్రి కేశబ్ మహంత కుమార్తె దిబిసా మహంత కూడా నిరసనల్లో పాల్గొన్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. ఈ పరిణామాలపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ స్పందిస్తూ, పిల్లలు పెద్దయ్యాక వారి చర్యలకు తల్లిదండ్రులను బాధ్యులను చేయవద్దని ప్రజలను కోరారు.