భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం క్రెడిట్‌పై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న వేళ, సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రెడిట్ టీడీపీకి గానీ, వైసీపీకి గానీ చెందదని, అసలు క్రెడిట్ మొత్తం జీఎంఆర్ సంస్థదేనని ఆయన స్పష్టం చేశారు. "భోగాపురం క్రెడిట్ ఎవరిది?" అంటూ ఆయన సోష‌ల్ మీడియాలో పెట్టిన సుదీర్ఘ పోస్ట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇందులో ప్రాజెక్టుకు సంబంధించి జరిగిన పలు కీలక పరిణామాలను ఆయన వరుసక్రమంలో వివరించారు.

"కొట్టుకోవడం ఆపండి, ఆ క్రెడిట్ జీఎంఆర్‌ది" అంటూ ప్రారంభించిన ఏబీవీ, గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అవసరానికి మించి 5,000 ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్ ఇవ్వడం, భూములు కోల్పోతున్న వారి ఆందోళనలకు అప్పటి ప్రతిపక్షం మద్దతివ్వడం వాస్తవమని గుర్తుచేశారు. ఆ తర్వాత భూమిని 3,000 ఎకరాలకు కుదించారని తెలిపారు. తొలుత టెండర్లలో ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) బిడ్ గెలుచుకున్నా, జీఎంఆర్ కోసం ఆ వేలాన్ని రద్దు చేశారని, అప్పటి పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు బలవంతంగా ఒప్పుకున్నారని పేర్కొన్నారు. ఆ తర్వాత నిబంధనలు సవరించి, ముందుగా నిర్ణయించిన ప్రకారమే జీఎంఆర్‌కు ప్రాజెక్టును అప్పగించారని ఆరోపించారు.

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పనులను నిలిపివేసిందని, తర్వాత కాకినాడ సెజ్‌లో జీఎంఆర్ వాటాలను అరబిందో సంస్థకు బదలాయించే ఒప్పందంలో భాగంగా 2023లో పనులను తిరిగి ప్రారంభించడానికి అనుమతించారని ఏబీవీ వివరించారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చాక మంత్రి రామ్మోహన్ నాయుడు దగ్గరుండి పనులను వేగవంతం చేశారని, కనెక్టింగ్ రోడ్లు, ఇతర సదుపాయాల కోసం పేద రాష్ట్రమైన ఏపీ కోట్ల రూపాయలు ఖర్చుచేయడం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.

ఒక బట్టల షాపింగ్ మాల్ ప్రారంభించినట్లు ప్రభుత్వం హడావుడి చేయడం, మీడియాలో అతి ప్రచారంపైనా ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇన్ని జరుగుతున్నా, విజయవాడ ఎయిర్‌పోర్టు అభివృద్ధిని పట్టించుకోకపోవడం, ఇప్పటికీ ఒక్క రోజువారీ అంతర్జాతీయ సర్వీసు కూడా తేలేకపోవడం చేదు వాస్తవమని అన్నారు. 

"వాట్సాప్ యుగంలో ప్రజల జ్ఞాపకశక్తిపై అందరికీ చులకన భావం. అందుకే ఒక వరుసలో గుర్తు చేస్తున్నా. ఇప్పుడు మీరే నిర్ణయించుకోండి, భోగాపురం భోగం ఎవరిది, క్రెడిట్ ఎవరిది?" అంటూ తన పోస్టును ముగించారు.