తెలుగు ప్రేక్షకులకు విభిన్నమైన కార్యక్రమాలతో వినోదాన్ని పంచుతున్న ఈటీవీ నెట్‌వర్క్ మరో కీలక మార్పుకు శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు వంటల కార్యక్రమాలతో ఆదరణ పొందిన 'ఈటీవీ అభిరుచి' ఛానెల్ ఇకపై పూర్తిస్థాయి మ్యూజిక్ ఛానెల్‌గా రూపాంతరం చెందనుంది. ఈ ఛానెల్‌కు 'ఈటీవీ మ్యూజిక్' అని పేరు మార్చారు. ఈనెల ఆగస్టు 27 నుంచి ఈ కొత్త ఛానెల్ అధికారికంగా ప్రారంభం కానుంది.

ఈటీవీ నెట్‌వర్క్ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రేక్షకులకు కానుకగా ఈ మ్యూజిక్ ఛానెల్‌ను అందిస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. ఇప్పటివరకు వంటలు, ఆరోగ్య చిట్కాలతో అలరించిన ఈటీవీ అభిరుచి స్థానంలో ఇకపై 24 గంటల పాటు సంగీత కార్యక్రమాలు ప్రసారం కానున్నాయి. కొత్త, పాత తెలుగు పాటలతో పాటు సంగీతానికి సంబంధించిన ప్రత్యేక కార్యక్రమాలతో సంగీత ప్రియులను అలరించడమే లక్ష్యంగా ఈటీవీ మ్యూజిక్ ప్రసారాలు సాగనున్నాయి.

ఈ మార్పుతో తెలుగు వినోద రంగంలో మరో ప్రత్యేకమైన మ్యూజిక్ ఛానెల్ అందుబాటులోకి రానుంది. తెలుగు పాటలను ఇష్టపడే వారికి ఈటీవీ మ్యూజిక్ ఓ కొత్త వేదిక కానుండటంతో ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుందని నెట్‌వర్క్ వర్గాలు భావిస్తున్నాయి.