పరిశుభ్రత విషయంలో భారతీయుల ద్వంద్వ వైఖరిపై బాంబే హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. విదేశాలకు వెళ్లినప్పుడు చెత్తను తప్పనిసరిగా డస్ట్‌బిన్‌లో వేసే వారు, స్వదేశంలో మాత్రం ఎలాంటి సంకోచం లేకుండా రోడ్డుపై పడేస్తున్నారని వ్యాఖ్యానించింది. దీన్ని స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం పేరుతో సమర్థించలేమని స్పష్టం చేసింది. పరిశుభ్రమైన వాతావరణం కోరుకునే ప్రతి పౌరుడిపై సమాజం పట్ల బాధ్యత కూడా ఉంటుందని హితవు పలికింది.

ముంబై తూర్పు శివార్లలోని కంజుర్‌మార్గ్‌ డంపింగ్‌ యార్డు నుంచి వస్తున్న కాలుష్యం, దుర్వాసన, విషవాయువులు, ఆరోగ్య సమస్యలకు సంబంధించిన పిటిషన్లపై విచారణ సందర్భంగా జస్టిస్‌ జీఎస్‌ కులకర్ణి, జస్టిస్‌ ఆర్తి సాథే ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని తెలిపింది. మరోవైపు పరిశుభ్రత నిబంధనల అమలులో మున్సిపల్‌ అధికారులు మరింత కఠినంగా వ్యవహరించాలని ఆదేశించింది.

‘‘మన దగ్గర చాలామంది ఏమాత్రం ఆలోచించకుండా రోడ్డుపైనే చెత్త పడేస్తారు. కానీ అదే వ్యక్తులు విదేశాల్లో చిన్న చాక్లెట్‌ కవర్‌ను కూడా డస్ట్‌బిన్‌లోనే వేస్తారు. ఇదేనా స్వేచ్ఛ, ప్రజాస్వామ్యానికి మూల్యం?’’ అంటూ ధర్మాసనం ప్రశ్నించింది. పరిశుభ్రమైన వాతావరణం కోరుకునే ప్రతి ఒక్కరూ దాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా తీసుకోవాలని స్పష్టం చేసింది. చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేసేవారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది.

నగరంలోని బీచ్‌లు ప్లాస్టిక్‌ వ్యర్థాలతో నిండిపోతున్నాయని హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ప్రధాన రహదారులు, సందుల్లో చెత్త పేరుకుపోవడం వల్ల ప్రజారోగ్యానికి ముప్పు ఏర్పడుతోందని పేర్కొంది. ఇలాంటి పరిస్థితుల్లో మనం నిజంగా నాగరిక సమాజంలో జీవిస్తున్నామా? అని ప్రశ్నించింది. ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ ప్రకటించిన ‘స్వచ్ఛ్‌ ముంబై, సుందర్‌ ముంబై’ లక్ష్యాన్ని ప్రజల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం దెబ్బతీస్తున్నాయని వ్యాఖ్యానించింది.

రాజాబాయి టవర్‌, హైకోర్టు భవనం వంటి వారసత్వ కట్టడాల సమీపంలో చెత్త తరలింపు వాహనాల నిర్వహణపైనా ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. అక్కడికి వచ్చే విదేశీ పర్యాటకులకు రోడ్లపై చెత్త కనిపించడం నగర ప్రతిష్ఠను దెబ్బతీస్తోందని పేర్కొంది. ఈ సమస్యపై వారం రోజుల్లో చర్యలు తీసుకోవాలని మున్సిపల్‌ సంస్థను ఆదేశించింది. లేకపోతే తగిన ఉత్తర్వులు జారీ చేయాల్సి వస్తుందని హెచ్చరించింది.