దేశంలో ఇందిరా గాంధీ విధించిన అత్యవసర స్థితి (ఎమర్జెన్సీ)కి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) మద్దతు తెలిపిందన్న తన వాదనను నిరూపించేందుకు కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్ రాజ్యసభలో కీలక ఆధారాలను సమర్పించారు. 1975లో నాటి ఆర్ఎస్ఎస్ అధినేత బాలసాహెబ్ దేవరస్ రాసిన మూడు లేఖలను ఆయన శుక్రవారం సభాపతికి అందజేశారు. ఎమర్జెన్సీకి ఆర్ఎస్ఎస్ మద్దతునిచ్చిందనడానికి ఆధారాలు చూపాలని బీజేపీ ఎంపీలు గురువారం విసిరిన సవాలుకు సమాధానంగా జైరాం రమేశ్ ఈ చర్య తీసుకున్నారు.

ఈ లేఖలను చారిత్రక ఆధారాలుగా జైరాం రమేశ్ పేర్కొన్నారు. వీటిలో రెండు లేఖలను దేవరస్ నాటి ప్రధాని ఇందిరా గాంధీకి రాయగా, మరొకటి ఆచార్య వినోబా భావేకి రాశారు. 1975 ఆగస్టు 22న ఇందిరా గాంధీకి రాసిన లేఖలో, ఆమె చేసిన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం "సమయోచితంగా, సమతుల్యంగా ఉంది" అని దేవరస్ ప్రశంసించారు. ఆర్ఎస్ఎస్‌పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని కోరుతూ, దేశాభివృద్ధిలో తమ సంస్థ సేవలను వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

1975 నవంబర్ 10న రాసిన మరో లేఖలో, ఇందిరా గాంధీ ఎన్నిక చెల్లుబాటును సుప్రీంకోర్టు సమర్థించినందుకు ఆమెకు అభినందనలు తెలిపారు. జయప్రకాశ్ నారాయణ్ (జేపీ) ఉద్యమంతో ఆర్ఎస్ఎస్‌కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తూ, సంస్థపై నిషేధాన్ని ఉపసంహరించుకోవాలని మరోసారి కోరారు. ప్రభుత్వ అభివృద్ధి ప్రణాళికల్లో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు భాగస్వాములు అయ్యేలా, ప్రధానికి తమపై ఉన్న అపోహలను తొలగించాలని వినోబా భావేను ఆయన కోరారు.