ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ పనితీరును ప్రశంసించారు. "శెభాష్ లోకేశ్, చాలా బాగా పనిచేస్తున్నావు" అంటూ ఆయన భుజం తట్టి అభినందించారు. ఇదే వేగం, స్ఫూర్తితో ప్రజాసేవలో ముందుకు సాగాలని లోకేశ్‌కు సూచించారు.

విజయనగరం జిల్లా భోగాపురంలో నూతనంగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమం అనంతరం ఈ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. కార్యక్రమం ముగించుకుని తిరిగి వెళుతున్న ప్రధాని మోదీకి రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేశ్ వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ప్రధాని ఆప్యాయంగా లోకేశ్‌తో మాట్లాడి, ఆయన పనితీరుపై ప్రశంసలు కురిపించారు.

గతంలో ఏపీలో ప్రధాని మోదీ పర్యటనలను విజయవంతం చేయడంలో, అలాగే 'యోగాంధ్ర' కార్యక్రమం ద్వారా రికార్డు సాధించడంలో లోకేశ్ చూపిన చొరవను ప్రధాని అప్పట్లోనూ మెచ్చుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి లోకేశ్ పనితీరుపై ప్రధాని బహిరంగంగా ప్రశంసలు కురిపించడం ప్రాధాన్యత సంతరించుకుంది.