ఒకప్పుడు టాలీవుడ్‌ ప్రేక్షకులను సైతం మెప్పించిన బాలీవుడ్ నటి ప్రీతి జింటా... సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ వెండితెరపై సందడి చేయడానికి సిద్ధమయ్యారు. మహేశ్ బాబుతో ‘రాజకుమారుడు’, వెంకటేశ్ సరసన ‘ప్రేమంటే ఇదేరా’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు అలరించిన ఆమె, వివాహం అనంతరం సినిమాలకు దూరమయ్యారు. ఇప్పుడు దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఒక భారీ పీరియాడికల్ డ్రామాతో గ్రాండ్ రీఎంట్రీ ఇస్తున్నారు.

 

బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్ సరసన ప్రీతి జింటా కథానాయికగా నటించిన లేటెస్ట్ పీరియడ్ డ్రామా మూవీ ‘బట్వార్ 1947’. 1947 నాటి దేశ విభజన నేపథ్యంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఆమిర్ ఖాన్ నిర్మించగా, విలక్షణ దర్శకుడు రాజ్‌కుమార్ సంతోషి తెరకెక్కించారు.

 

ఈ భారీ ప్రాజెక్ట్‌కు ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ స్వరాలు సమకూర్చారు. ప్రీతి జింటాతో పాటు సీనియర్ నటి షబానా అజ్మీ, ఆలీ ఫజల్ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దేశ విభజన నాటి పరిస్థితులు, మానవీయ సంబంధాలు, ప్రజలు ఎదుర్కొన్న భావోద్వేగ ఘర్షణల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఇందులో ప్రీతి జింటా ఎంతో ప్రాధాన్యత ఉన్న, బలమైన పాత్రలో నటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని తుది పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం, స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్ట్ 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.