గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత బాక్సర్ ప్రీతి సత్తా చాటింది. మహిళల 54 కేజీల బాక్సింగ్ విభాగంలో ఫైనల్‌లో కెనడాకు చెందిన ఎస్.ఎస్. డెల్గాడోను చిత్తు చేసి స్వర్ణ పతకాన్ని ముద్దాడింది. ఏక‌ప‌క్షంగా సాగిన ఈ  తుదిపోరులో ప్రీతి 5-0తో అద్భుత విజయాన్ని అందుకుంది.

పోటీ ప్రారంభమైనప్పటి నుంచే ప్రీతి పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. తన పదునైన పంచ్‌లతో ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. మూడు రౌండ్లలోనూ ఐదుగురు జడ్జీలు ప్రీతికే 10-9 చొప్పున పాయింట్లు కేటాయించడం ఆమె ఆధిపత్యానికి నిదర్శనం. ఈ క్రమంలో కెనడా బాక్సర్‌ను ఒకసారి నాక్‌డౌన్ కూడా చేసింది. అద్భుతమైన ఫుట్‌వర్క్, పదునైన కాంబినేషన్లతో వ్యూహాత్మకంగా ఆడి విజయాన్ని ఖాయం చేసుకుంది.

ఈ స్వర్ణ పతకంతో గ్లాస్గో గేమ్స్‌లో భారత్ పతకాల సంఖ్య 24కి చేరింది. ఇందులో 6 స్వర్ణాలు, 12 రజతాలు, 6 కాంస్య పతకాలు ఉన్నాయి. దీంతో పతకాల పట్టికలో భారత్ 9వ స్థానానికి ఎగబాకింది. బాక్సింగ్‌లో భారత క్రీడాకారులు నిలకడగా రాణిస్తుండగా, ప్రీతి విజయం దేశానికి మరో గర్వకారణంగా నిలిచింది.