ఐపీఎల్ 2026 నుంచి ముంబై ఇండియన్స్ ముందుగానే నిష్క్రమించడంతో హార్దిక్ పాండ్య కెప్టెన్సీపై విమర్శలు వ్యక్తమయ్యాయి. వచ్చే సీజన్‌లో ఈ ఆల్‌రౌండర్ జట్టుకు నాయకత్వం వహించకూడదని కొంతమంది క్రీడా నిపుణులు, అభిమానులు సూచిస్తున్నారు. ఈ సీజన్‌లో అతను 8 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 146 పరుగులు చేసి.. 3 వికెట్లు మాత్రమే తీశాడు. వచ్చే ఏడాది హార్దిక్ ఎంఐ కెప్టెన్‌గా కొనసాగడం తనకు ఇష్టం లేనప్పటికీ వ్యక్తిగత ఆటపై దృష్టి పెట్టేందుకు ఫ్రాంచైజీ అతన్ని తప్పకుండా కొనసాగించాలని భారత మాజీ బ్యాటర్ వసీం జాఫర్ పేర్కొన్నాడు.

జాఫర్ తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ.. 'నేను అతడిని కెప్టెన్‌గా చేయను, కానీ జట్టులో తప్పకుండా కొనసాగిస్తాను. అతను మరింతగా రాణించి, తనలోని అత్యుత్తమ ప్రతిభను వెలికితీయాలని నేను కోరుకుంటున్నాను' అని అన్నాడు. అలానే హార్దిక్ స్థానంలో కెప్టెన్‌గా ఎవరిని నియమిస్తారని అడగ్గా..' ప్రస్తుత పరిస్థితుల్లో కెప్టెన్‌ను ఎంపిక చేయడం కష్టం' అని జాఫర్ సమాధానం ఇచ్చాడు.

ఈ సీజన్ తమ చివరి లీగ్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో 30 పరుగుల తేడాతో ఓటమి పాలైన ముంబై ఇండియన్స్.. పాయింట్ల పట్టికలో నిరాశాజనకంగా తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకుంది. గత 14 మ్యాచ్‌లలో ఇది వారికి 10వ ఓటమి. కేవలం ఎనిమిది పాయింట్లతో పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచినప్పటికీ కెప్టెన్ హార్దిక్‌పై ఎటువంటి నిందలు వేయడం జరగదని ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ కోచ్ కీరన్ పొలార్డ్ స్పష్టం చేశారు. నాయకత్వ కోణం నుండి చూస్తే, హార్దిక్ వ్యక్తిగతంగా కోరుకున్నంత బాగా రాణించలేదని పొలార్డ్ విలేకరులతో అన్నారు. 'యాజమాన్య సిబ్బందిగా మేము కోరుకున్నట్లుగా జరగకపోయి ఉండవచ్చు. ఫ్రాంచైజీకి నాయకత్వం వహించడానికి, అతడు రాణించడానికి మేము అన్ని విధాలా ప్రయత్నించాము. ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ విఫలం కావడానికి తమఫ్రాంచైజీ సామూహిక వైఫల్యం' అని పొలార్డ్ అన్నారు.