తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే అధినేత విజయ్ వ్యక్తిగత జీవితంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆయన భార్య సంగీత తాను దాఖలు చేసిన విడాకుల పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారు. దీంతో గత కొన్ని నెలలుగా చర్చనీయాంశంగా మారిన ఈ వ్యవహారానికి తాత్కాలికంగా తెరపడింది.
ఈ ఏడాది ఫిబ్రవరిలో చెంగల్పట్టు కోర్టును ఆశ్రయించిన సంగీత, తమ దాంపత్య బంధాన్ని రద్దు చేయాలని కోరారు. ఇద్దరి మధ్య విభేదాలు సర్దుబాటు అయ్యే పరిస్థితి లేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. భరణం ఇవ్వాలని, చెన్నైలోని నీలంకరై నివాసంలో ఉండేందుకు అనుమతి కల్పించాలని కూడా విజ్ఞప్తి చేశారు.
విడాకుల కేసు విచారణ ఈ ఏడాది పలుసార్లు వాయిదా పడింది. గత నెల జరిగిన విచారణకు విజయ్, సంగీత ఇద్దరూ హాజరుకాలేదు. వారి తరఫు న్యాయవాదులు మాత్రమే కోర్టుకు హాజరై వ్యక్తిగత కారణాలతో రాలేకపోయినట్లు తెలిపారు. అనంతరం విచారణను ఆగస్టు 7కు వాయిదా వేశారు.
తాజా విచారణ సందర్భంగా సంగీత తన విడాకుల పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. ఆమె నిర్ణయానికి గల కారణాలపై మాత్రం ఎలాంటి అధికారిక సమాచారం వెల్లడికాలేదు.
సంగీత వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్న కోర్టు, పిటిషన్‌ను ఉపసంహరించుకోవడానికి అనుమతి ఇచ్చింది. ఈ కేసును "విత్‌డ్రాన్"గా పరిగణిస్తూ మూసివేస్తున్నట్లు (డిస్పోజ్) ప్రకటించింది. సంగీత నిర్ణయంపై విజయ్ తరఫు న్యాయవాది ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. భవిష్యత్తులో అవసరమైతే మళ్లీ కొత్త పిటిషన్ దాఖలు చేసుకునేందుకు సంగీతకు కోర్టు స్వేచ్ఛనిచ్చింది.
1999లో విజయ్, సంగీత వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు సంతానం ఉన్నారు. ఇటీవల విజయ్ రాజకీయాల్లో పూర్తిస్థాయిలో చురుగ్గా మారిన తర్వాత ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలు తరచూ చర్చకు వచ్చాయి.
ఈ ఏడాది ఫిబ్రవరిలో సంగీత విడాకుల కోసం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తన భర్త విజయ్‌కు మరో నటితో వివాహేతర సంబంధం ఉందని, ఈ విషయం 2021లోనే తనకు తెలిసిందని ఆమె తన పిటిషన్‌లో ఆరోపించారు. సంబంధం మానుకుంటానని హామీ ఇచ్చి కూడా విజయ్ దానిని కొనసాగించారని, తనను సామాజికంగా, వృత్తిపరంగా దూరం పెట్టారని పేర్కొన్నారు.
అంతేకాకుండా, సదరు నటితో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకోవడం, తనపై ఆర్థిక ఆంక్షలు విధించడం, రాకపోకలపై పరిమితులు పెట్టడం వంటి చర్యలతో తనను, తమ ఇద్దరు పిల్లలను (జాసన్ సంజయ్, దివ్య సాషా) తీవ్ర మానసిక క్షోభకు గురిచేశారని సంగీత ఆరోపించారు. తమ వివాహ బంధం కోలుకోలేని విధంగా దెబ్బతిన్నదని అప్పట్లో ఆమె పేర్కొన్నారు. ఇప్పుడు ఆ సంచలన ఆరోపణల కేసును ఆమె ఉపసంహరించుకోవడం తమిళ రాజకీయ, సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
సీఎం విజయ్ విడాకుల వ్యవహారంలో ఊహించని ట్విస్ట్... పిటిషన్ వెనక్కి తీసుకున్న భార్య సంగీత..
