యువతను ఉద్దేశించి "గట్టర్ జనరేషన్" అని వ్యాఖ్యానించి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్ తన వైఖరిని మార్చుకున్నారు. జెన్-జీ యువత దేశానికి బలమని, వారు గొప్ప ఆస్తి అని ఆమె కొనియాడారు. పార్లమెంట్ వెలుపల మీడియాతో మాట్లాడిన కంగనా రనౌత్, "జెన్-జీ మన దేశానికి బలం, ఒక రకంగా చెప్పాలంటే గొప్ప ఆస్తి. మన యువత దేశ సంస్కృతికి, అస్తిత్వానికి ప్రతినిధులుగా నిలవడం ఎంతో సంతోషకరం" అని పేర్కొన్నారు.

పది, పదిహేను మంది అనుచితంగా ప్రవర్తించినంత మాత్రాన యువతరం మొత్తాన్ని నిందించడం సరికాదని ఆమె ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

ఇటీవల ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలను కంగనా రనౌత్ ప్రస్తావించారు. ఆయన సూచనలను తామంతా ఆలకించే అవకాశం లభించిందని తెలిపారు. నిరసన తెలిపే యువత డిమాండ్లను వినాలని, శాంతియుతంగా ఆందోళన చేసేవారు దేశ వ్యతిరేకులు కాదని, వారిపై ముద్రలు వేయకుండా చర్చలు జరపాలని మోహన్ భగవత్ సూచించిన విషయం తెలిసిందే.

పరీక్షల్లో అక్రమాలపై నిరసన తెలుపుతున్న యువతను విమర్శిస్తూ కంగనా గతంలో తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని పోస్టులు చేశారు. కొందరు యువతులు ఉపయోగించిన భాషను తప్పుబడుతూ వారిని 'గట్టర్ జనరేషన్' అని సంబోధించారు. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో తాజాగా కంగనా రనౌత్ తన వ్యాఖ్యలను సవరించుకున్నారు. శాంతియుత నిరసనకారులకు, అల్లరి చేసే వారికి మధ్య వ్యత్యాసం ఉంటుందని ఆమె వివరణ ఇచ్చారు.