కర్ణాటకలోని ఉడుపి జిల్లాలో దారుణం జరిగింది. స్థానిక కాంగ్రెస్ నేత, పంచాయతీ మాజీ అధ్యక్షుడు, ప్రముఖ వ్యాపారవేత్త అయిన డేవిడ్ డిసౌజాను గుర్తుతెలియని దుండగులు అతి కిరాతకంగా కాల్చి చంపారు. రోడ్డు పక్కన ఆపి ఉన్న తన కారు ఎక్కుతుండగా, వెనుక నుంచి వచ్చిన ఓ దుండగుడు పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో ఆయనపై కాల్పులు జరిపాడు. ఈ భయానక ఘటన మొత్తం అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయింది.

డేవిడ్ డిసౌజా తన కారు డోర్ తీస్తుండగా, వెనుక నుంచి నడుచుకుంటూ వచ్చిన ఒక వ్యక్తి అకస్మాత్తుగా తుపాకి బయటకు తీశాడు. డిసౌజా తేరుకునేలోపే అతి సమీపం నుంచి ఆయనపై పలు రౌండ్లు కాల్పులు జరిపాడు. దీంతో తీవ్ర గాయాలతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. కాల్పులు జరిపిన వెంటనే, మోటార్‌సైకిల్‌పై సిద్ధంగా ఉన్న మరో వ్యక్తితో కలిసి నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు.

రక్తపు మడుగులో పడివున్న డిసౌజాను స్థానికులు గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే, అప్పటికే తీవ్ర రక్తస్రావం కావడంతో మార్గమధ్యంలోనే ఆయన ప్రాణాలు విడిచినట్లు వైద్యులు తెలిపారు. కాంగ్రెస్ నేత, కాంట్రాక్టర్‌గా పేరున్న డిసౌజా హత్యతో స్థానిక రాజకీయ, వ్యాపార వర్గాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి.

సమాచారం అందుకున్న సీనియర్ పోలీస్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. సీసీటీవీ ఫుటేజ్‌ను స్వాధీనం చేసుకుని, నిందితుల కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఈ హత్య వెనుక వ్యాపార శత్రుత్వం ఉందా? లేక రాజకీయ కారణాలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.