భారతీయ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘రామాయణం’ చిత్రానికి సంబంధించి ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా భారత్‌లో విడుదలకు రెండు రోజుల ముందే విదేశీ ప్రేక్షకుల ముందుకు రానుంది. భారత్‌లో దీపావళి సందర్భంగా నవంబర్ 8న విడుదల చేయాలని చిత్రబృందం లక్ష్యంగా పెట్టుకుంది. అంతర్జాతీయంగా నవంబర్ 6నే దీన్ని ప్రదర్శించనున్నారు. విడుదల తేదీల్లో ఈ వ్యత్యాసానికి కారణాన్ని నిర్మాత నమిత్ మల్హోత్రా వెల్లడించారు.
అంతర్జాతీయ మార్కెట్‌లో సాధారణంగా సినిమాలను శుక్రవారం విడుదల చేసే విధానం ఉందని నమిత్ మల్హోత్రా తెలిపారు. నవంబర్ 6 శుక్రవారం కావడంతో విదేశాల్లో ఆ తేదీని ఖరారు చేసినట్లు చెప్పారు. భారత్‌లో మాత్రం దీపావళిని దృష్టిలో పెట్టుకుని నవంబర్ 8న విడుదల చేసేందుకు ప్రస్తుతం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు.
‘రామాయణం’ను అంతర్జాతీయ స్థాయి చిత్రంగా తీర్చిదిద్దేందుకు చిత్రబృందం ప్రయత్నిస్తోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు ప్రపంచవ్యాప్తంగా భారీ స్పందన లభించింది. ట్రైలర్ విడుదలైన కేవలం ఐదు రోజుల్లోనే వంద కోట్లకుపైగా వీక్షణలు నమోదైనట్లు నమిత్ మల్హోత్రా తెలిపారు.
ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా, యశ్ రావణుడిగా కనిపించనున్నారు. లక్ష్మణుడిగా రవి దూబే, హనుమంతుడిగా సన్నీ డియోల్, శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్, మండోదరిగా కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు.
‘రామాయణం’కు ఆస్కార్ దక్కాలన్నదే తమ ప్రధాన లక్ష్యం కాదని నమిత్ మల్హోత్రా స్పష్టం చేశారు. అయితే ప్రపంచంలోని అత్యుత్తమ సృజనాత్మక ప్రతిభను గుర్తించే అకాడమీ వేదికపై తమ చిత్రానికి గుర్తింపు లభిస్తే.. అది భారతదేశానికి ఎంతో గొప్ప క్షణంగా నిలుస్తుందని అన్నారు.
భారతీయ ఇతిహాసమైన రామాయణాన్ని ప్రపంచ ప్రేక్షకులకు పరిచయం చేసే భారీ ప్రయత్నంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని చిత్రబృందం చెబుతోంది.
భారత్ కంటే ముందే విదేశాల్లో ‘రామాయణం’.. రెండు రోజుల గ్యాప్‌కు కారణమిదే!
