ఇరాన్‌తో గత ఐదు నెలలుగా సాగుతున్న యుద్ధం కారణంగా అమెరికా ఆయుధ నిల్వలు పడిపోతుండటంతో... యుద్ధానికి ముగింపు పలకాలనే డిమాండ్లు స్వదేశంలో వేగవంతమయ్యాయి. ఈ నేపథ్యంలో, అమెరికా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ జనరల్ డాన్ కేన్, అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కార్యవర్గానికి తీవ్ర హెచ్చరికలు చేసినట్లు అంతర్జాతీయ కథనాలు వెల్లడించాయి. కేవలం వైమానిక దాడులతో నిర్దేశిత లక్ష్యాలను సాధించలేమని, యుఎస్-ఇరాన్ యుద్ధం మరింత విస్తరిస్తే తీవ్ర ప్రతికూల ఫలితాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన ట్రంప్ సలహాదారులకు అంతర్గతంగా స్పష్టం చేశారు.
ఈ అంశంపై ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో, సీఐఏ డైరెక్టర్ జాన్ రాట్‌క్లిఫ్‌లతో ఆయన చర్చించినట్లు సమాచారం. మరోవైపు, సుదీర్ఘ వైమానిక దాడుల వల్ల అమెరికాకు చెందిన 80 శాతం మిసైల్ డిఫెన్స్ ఇంటర్‌సెప్టర్లు, సగానికి పైగా పేట్రియాట్ క్షిపణులు ఖాళీ అయ్యాయనే కథనాలను ట్రంప్ ఖండించినప్పటికీ, ఆయుధ కొరతపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో యుద్ధానికి ముగింపు పలకాలని డాన్ కేన్ సూచించడం అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తోంది.
