మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటారు. గత కొంతకాలంగా సరైన విజయం కోసం ఎదురుచూస్తున్న ఆయన, తాజాగా ‘కొరియన్ కనకరాజు’ చిత్రంతో అదిరిపోయే కంబ్యాక్ ఇచ్చారు. ఈ సినిమా తొలి రోజే రికార్డు స్థాయిలో వసూళ్లు సాధించి, వరుణ్ తేజ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలిచింది.

ఈ చిత్రం ప్రీమియర్స్, తొలి రోజు కలిపి ప్రపంచవ్యాప్తంగా రూ.10.2 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇప్పటివరకు వరుణ్ తేజ్ కెరీర్‌లో అత్యధిక తొలి రోజు వసూళ్లు సాధించిన ‘గద్దలకొండ గణేష్’ రికార్డును ‘కొరియన్ కనకరాజు’ అధిగమించింది. వరుస పరాజయాలతో నిరాశలో ఉన్న అభిమానులకు ఈ ఘన విజయం కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. 

మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ఈ హారర్ కామెడీ చిత్రంలో వరుణ్ తేజ్ సరసన రితిక నాయక్ హీరోయిన్‌గా నటించగా, కమెడియన్ సత్య కీలకపాత్ర పోషించారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాపై ముందునుంచే మంచి అంచనాలు నెలకొన్నాయి.