మీ చేతిలో ఐఫోన్ అన్‌లాక్ చేసి ఉండగా ఎవరైనా లాక్కొని పారిపోతే కేవలం కొన్ని సెకన్లలోనే మీ బ్యాంకింగ్ యాప్స్, పాస్‌వర్డ్‌లు ప్రమాదంలో పడొచ్చు. ఇలాంటి దొంగతనాలకు చెక్ పెట్టేందుకు యాపిల్‌ సంస్థ ఒక అద్భుతమైన సెక్యూరిటీ ఫీచర్‌ను అభివృద్ధి చేస్తోంది. ఫోన్‌ను ఎవరైనా చేతి నుంచి లాక్కున్నట్లు గుర్తిస్తే ఆ మరుక్షణమే ఐఫోన్ ఆటోమేటిక్‌గా లాక్ అయ్యేలా కొత్త వ్యవస్థను డిజైన్ చేస్తున్నారు.

దొంగతనాన్ని ఫోన్ ఎలా గుర్తిస్తుంది?
ప్రముఖ టెక్ సైట్ ‘9to5Mac’ ప్రకారం ఐఫోన్‌లోని వివిధ సెన్సార్ల సాయంతో ఈ ఫీచర్ పనిచేస్తుంది. ముఖ్యంగా ఫోన్ కదలికలను గమనించే ‘యాక్సిలెరోమీటర్’ చిప్ ద్వారా ఎవరైనా ఫోన్‌ను చేతి నుంచి గట్టిగా లాక్కున్నప్పుడు వచ్చే కుదుపును సిస్టమ్ గుర్తిస్తుంది. ఒకవేళ అలాంటి అసాధారణ వేగం, కదలిక కనిపిస్తే ఫోన్ స్క్రీన్ వెంటనే లాక్ అయిపోతుంది. దీనివల్ల దొంగ చేతికి ఫోన్ చిక్కినా లోపల ఉన్న డేటాను ఓపెన్ చేయలేడు.

యాపిల్‌ వాచ్ దూరమైతే అలర్ట్
ఈ సరికొత్త ఫీచర్‌లో యాపిల్‌ వాచ్ కూడా కీలక పాత్ర పోషించనుంది. యూజర్ చేతికి ఉన్న యాపిల్‌ వాచ్‌కు, ఐఫోన్‌కు మధ్య ఉన్న దూరాన్ని సిస్టమ్ నిరంతరం గమనిస్తుంది. ఫోన్ అన్‌లాక్డ్‌గా ఉన్నప్పుడు వాచ్‌కు, ఫోన్‌కు మధ్య కనెక్షన్ సిగ్నల్ ఒక్కసారిగా పడిపోయినా లేదా దూరం వేగంగా పెరిగినా దాన్ని దొంగతనంగా ఫోన్ గుర్తిస్తుంది. వెంటనే ఫోన్‌ను లాక్ చేయడంతో పాటు భద్రతను కట్టుదిట్టం చేస్తుంది.

కొత్త ప్రదేశంలో మరింత కఠినంగా
యాపిల్‌ ఇప్పటికే అందిస్తున్న ‘స్టోలెన్ డివైజ్ ప్రొటెక్షన్’ నిబంధనల ఆధారంగానే ఈ కొత్త ఫీచర్ కూడా పనిచేస్తుంది. ఫోన్ ఇంట్లో లేదా ఆఫీస్ లాంటి నమ్మకమైన వైఫై నెట్‌వర్క్‌లో కాకుండా ఏదైనా కొత్త ప్రదేశంలో ఉన్నప్పుడు ఈ లాకింగ్ సిస్టమ్ మరింత అగ్రెసివ్‌గా మారుతుంది. ఆండ్రాయిడ్ ఫోన్లలో ఇప్పటికే ఉన్న ‘థెఫ్ట్ డిటెక్షన్ లాక్’ తరహాలోనే ఈ ఫీచర్‌ను యాపిల్‌ డెవలప్ చేస్తోంది. త్వరలోనే రాబోయే ఐఓఎస్ అప్‌డేట్లలో ఇది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.