గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'పెద్ది' చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించడంతో మెగాస్టార్ చిరంజీవి చిత్ర బృందాన్ని అభినందించారు. దర్శకుడు బుచ్చిబాబు సానా, ఇతర యూనిట్ సభ్యులు ఇవాళ చిరంజీవిని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా చిరంజీవి వారిని ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ సినిమా ఘన విజయం సాధించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.

జూన్ 4న విడుదలైన 'పెద్ది' చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ. 345 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించారు. ఈ చిత్రంలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్, బోమన్ ఇరానీ కీలక పాత్రలు పోషించగా, అప్పలసూరి అనే ముఖ్యమైన పాత్రలో జగపతి బాబు నటనకు మంచి ప్రశంసలు దక్కుతున్నాయి.

ఈ సందర్భంగా చిరంజీవి తమను అభినందించిన ఫొటోలను 'పెద్ది' చిత్ర బృందం ఎక్స్ వేదికగా పంచుకుంది. "మెగాస్టార్ గారు 'పెద్ది' బ్లాక్‌బస్టర్ విజయంపై చిత్ర బృందాన్ని అభినందించారు" అని పోస్ట్‌లో పేర్కొంది.