గుంటూరు జిల్లాలో రాజకీయం చేయాలంటే పీహెచ్‌డీ కావాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. రాజకీయం పుట్టింది గుంటూరులో అంటారని, మరొక 30 ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండేలా ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. బ్రిటీష్ పాలనలో ఎలాంటి అంధకారం ఉందో అటువంటి అంధకారమే జగన్ పాలనలో ఉందని అన్నారు. దేశంలో ఏపీలో మాత్రమే భారీ మెజార్టీతో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని తెలిపారు. ఆదివారం ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..

రెండేళ్లలో ఏం చేశామో పుస్తకం వేసి మరీ చర్చకు రమ్మంటున్నాం. గొడ్డలి పార్టీ పాలనలో పల్నాడులో ప్రతి రోజు ఏదో ఒక వార్త వినాల్సి వచ్చేది. జగన్ ఎన్నో తప్పుడు బటన్లు నొక్కాడు. చంద్రబాబును అరెస్ట్ చేసి.. గొడ్డలి పార్టీ భూస్థాపితం అయ్యే తప్పుడు బటన్ కూడా నొక్కాడు. భాష్యం ప్రవీణ్‌కు టీడీపీలో ఉజ్వలమైన భవిష్యత్ ఉంది. మీ ఉత్సాహం చూస్తుంటే నాకు పూనకం వస్తుంది’..

ఎన్నికల సభ కంటే ఉత్సాహంగా రెండేళ్ల విజయోత్సవ సభ జరిగింది. ఎంపీ శ్రీ కృష్ణ దేవరాయలు గురించి అవాకులు చవాకులు పేలుతున్నారు. కృష్ణ కాదు కృష్ణ దేవరాయలు అని గుర్తుపెట్టుకోండి. ఆయన వ్యక్తిత్వం మాకు తెలుసు. ప్రజా సమస్యల గురించి నిత్యం మాట్లాడుతుంటారు’ అని అన్నారు.