టాటా గ్రూప్‌కు చెందిన రిటైల్ దిగ్గజం ట్రెంట్ లిమిటెడ్‌లో ఒక శకం ముగిసింది. కంపెనీ చైర్మన్‌గా దాదాపు మూడు దశాబ్దాల పాటు సేవలందించిన ప్రముఖ వ్యాపారవేత్త నోయెల్ టాటా తన పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. కంపెనీ 47వ వార్షిక సర్వసభ్య సమావేశంలో వాటాదారులను ఉద్దేశించి మాట్లాడుతూ, చైర్మన్‌గా ఇదే తన చివరి సమావేశమని ఆయన స్పష్టం చేశారు. దీంతో ఆయన సుదీర్ఘ ప్రస్థానానికి తెరపడినట్లయింది.

టాటా గ్రూప్ గవర్నెన్స్ మార్గదర్శకాల ప్రకారం.. నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల పదవీ విరమణ వయసు 70 ఏళ్లుగా నిర్దేశించారు. ఈ ఏడాది నవంబర్‌లో నోయెల్ టాటాకు 70 ఏళ్లు నిండనున్న నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ రిటైర్మెంట్ ప్రకటనతో టాటా గ్రూప్‌ రిటైల్ విభాగంలో ఆయన పోషించిన కీలక పాత్రకు ముగింపు పలికినట్లయింది.

నోయెల్ టాటా ప్రస్థానం ట్రెంట్ కంపెనీతో విడదీయరానిది. ఆయన తల్లి సిమోన్ టాటా, ల్యాక్మేను విక్రయించిన తర్వాత ట్రెంట్ కంపెనీని స్థాపించారు. 1998లో నోయెల్ టాటా ఈ కంపెనీ బోర్డులో డైరెక్టర్‌గా చేరారు. ఆ మరుసటి ఏడాదే, 1999 జూన్ లో కంపెనీకి తొలి మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించి, దేశంలో రిటైల్ వ్యూహాన్ని మార్చేసిన ఘనతను సొంతం చేసుకున్నారు.

ఆయన నాయకత్వంలో ట్రెంట్ అద్భుతమైన వృద్ధిని సాధించింది. ఒక్క వెస్ట్‌సైడ్ స్టోర్‌తో ప్రారంభమైన ఈ కంపెనీ, నేడు దేశవ్యాప్తంగా 1,200కు పైగా స్టోర్లతో అతిపెద్ద రిటైల్ నెట్‌వర్క్‌లలో ఒకటిగా అవతరించింది. ముఖ్యంగా ఫ్యాషన్ రంగంలో 'జుడియో', సూపర్‌మార్కెట్ రంగంలో 'స్టార్' బ్రాండ్‌లను విజయవంతంగా విస్తరించి కంపెనీ వృద్ధిలో కీలక పాత్ర పోషించారు. 

కంపెనీ వార్షిక (ఎఫ్‌వై26) నివేదికలోనూ ట్రెంట్ ప్రయాణాన్ని ఒక స్థిరమైన పరిణామంగా ఆయన అభివర్ణించారు. ఆయన హయాంలోనే కంపెనీ ఆదాయం రూ.19,701 కోట్లకు చేరింది. దివంగత పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటాకు నోయెల్ టాటా సోదరుడు కావడం గమనార్హం.