టైర్-2, టైర్-3 నగరాల నుంచి అంతర్జాతీయ ప్రయాణాలు చేసే వారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. విదేశాలకు వెళ్లే ప్రయాణికుల కోసం నూతన విధానంలో భాగంగా 'ఈజీ కనెక్ట్' విమాన సేవలను ప్రారంభించింది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు శుక్రవారం వారణాసిలోని లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి తొలి సర్వీస్‌ను లాంఛనంగా ప్రారంభించారు.
ఈ కొత్త విధానంతో... ఇకపై చిన్న నగరాల నుంచి విదేశాలకు వెళ్లే ప్రయాణికులు తాము బయలుదేరే విమానాశ్రయంలోనే చెక్-ఇన్, ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ వంటి లాంఛనాలన్నీ పూర్తి చేసుకోవచ్చు. ఉదాహరణకు, వారణాసిలో అంతర్జాతీయ ప్రయాణం మొదలుపెట్టే వారు అక్కడే అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసి, దేశీయ విమానంలో ఢిల్లీ వంటి ఇంటర్నేషనల్ హబ్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ఎలాంటి తనిఖీలు లేకుండా నేరుగా అంతర్జాతీయ విమానం ఎక్కవచ్చు.
ఈ సందర్భంగా మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. విమాన ప్రయాణాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావడంతో పాటు, భారత విమానయాన రంగాన్ని ప్రపంచంలోనే పోటీపడేలా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. "భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా, స్వయం సమృద్ధి కలిగిన ఏవియేషన్ రంగాన్ని నిర్మించడంలో ఇది ఒక కీలక ముందడుగు" అని ఆయన తెలిపారు.
ఈ 'ఈజీ కనెక్ట్' వ్యూహంతో 2030 నాటికి భారత్‌ను ప్రయాణికులకు ప్రాధాన్య ఏవియేషన్ హబ్‌గా, 2047 నాటికి గ్లోబల్ ఏవియేషన్ హబ్‌గా మార్చాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విధానం వల్ల పర్యాటకం, వాణిజ్యం, పెట్టుబడులు పెరిగి ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. దీని ద్వారా 2030 నాటికి దాదాపు 4 లక్షల ఉద్యోగాలు, 30 బిలియన్ డాలర్ల అదనపు జీడీపీ సమకూరుతుందని అంచనా.
వారణాసి నుంచి తొలి 'ఈజీ కనెక్ట్' విమాన సర్వీస్ ప్రారంభం...
