బులియన్ మార్కెట్ ‘బేర్’మంటోంది. గత ఏడాది రేసుగుర్రాల్లా పరుగెత్తిన బంగారం, వెండి ధరలు ఇప్పుడు నేలచూపులు చూస్తున్నాయి. గురువారం ఢిల్లీ స్పాట్ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి (24 క్యారట్స్) బంగారం ధర రూ.2,800 తగ్గి రూ.1,45,300 చేరుకోగా.. కిలో వెండి ధర రూ.5,000 నష్టంతో రూ.2.26 లక్షల దగ్గర క్లోజైంది. గత ఏడు నెలల్లో బంగారం, వెండి ధరలు ఇంత కనిష్ఠ స్థాయికి చేరడం ఇదే మొదటిసారి.
అంతర్జాతీయ మార్కెట్లోనూ..
అంతర్జాతీయ బులియన్ మార్కెట్లోనూ గురువారం ఇదే ట్రెండ్ కనిపించింది. ఔన్స్ (31 గ్రాములు) పసిడి ధర ఒక దశలో 0.53 శాతం నష్టపోయి 3,978.06 డాలర్లకు, ఔన్స్ వెండి ధర 0.56 శాతం నష్టంతో 57.10 డాలర్ల ఇంట్రాడే కనిష్ఠ స్థాయికి చేరాయి. ఈ ఏడాది జనవరితో పోలిస్తే ఔన్స్ బంగారం ధర 20 శాతం, వెండి ధర 53 శాతం పడిపోయాయి.
పతనానికి కారణాలు
-
ప్రధాన కరెన్సీలతో డాలర్ మారకం రేటు బలపడడం
-
తగ్గుముఖం పట్టిన అంతర్జాతీయ ఉద్రిక్తతలు.
-
పసిడి, వెండి నుంచి ఈక్విటీ షేర్లు, ఇతర ఆస్తులకు మారుతున్న పెట్టుబడులు.
-
అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచుతుందనే అంచనాలు
-
కేంద్ర బ్యాంకులు పసిడి కొనుగోళ్లు తగ్గించడం
-
కొనసాగుతున్న లాభాల స్వీకరణ అమ్మకాలు
మార్కెట్ దారెటు?
ప్రస్తుతం బులియన్ మార్కెట్లో కొనసాగుతున్న ఈ దిద్దుబాటు ఎన్నాళ్లు కొనసాగుతుందనే దానిపై మార్కెట్ నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరో రెండు మూడు నెలల పాటు ఈ డౌన్‌ట్రెండ్ కొనసాగుతుందని మెజారిటీ నిపుణుల అంచనా. ఈ సమయంలో దేశీయ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి బంగారం రూ.1.35 లక్షల నుంచి రూ.1.45 లక్షల మధ్య, కిలో వెండి రూ.2.2 లక్షల నుంచి రూ.2.5 లక్షల మధ్య ట్రేడయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీర్ఘకాలిక మదుపరులు ఒక్కసారిగా కాకుండా ఈ ధరల్లో కొద్దికొద్దిగా కొనుగోలు చేయవచ్చని సలహా ఇస్తున్నారు.
