వాతావరణ మార్పుల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో రేపటి (శనివారం) నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) వెల్లడించింది. విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ స్పందిస్తూ... రేపు ఉత్తరాంధ్ర, కాకినాడ, కోనసీమ, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడొచ్చని తెలిపారు. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందన్నారు.
భారత వాతావరణ శాఖ (ఐఎండీ) కూడా రానున్న కొద్దిరోజుల పాటు ఏపీలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తన నివేదికలో పేర్కొంది.
ఆదివారం (జూన్ 28) కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలకు ఆస్కారం ఉందని అధికారులు వివరించారు. వర్షాలు, ఈదురు గాలుల సమయంలో ప్రజలు చెట్లు, హోర్డింగ్‌ల కింద ఆశ్రయం పొందవద్దని సూచించారు. విద్యుత్ తీగలకు దూరంగా ఉండాలని, రైతులు, పశువుల కాపరులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని విజ్ఞప్తి చేశారు.
ఏపీలో రేపటి నుంచి భారీ వర్షాలు...
