దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా తమ వాహనాల ధరలను పెంచుతున్నట్లు గురువారం ప్రకటించింది. ఈ కొత్త ధరలు జూన్ నుంచి అమల్లోకి రానున్నాయి. మోడల్‌ను బట్టి గరిష్ఠంగా రూ. 30,000 వరకు ధరలు పెరగనున్నాయని కంపెనీ తన స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో స్పష్టం చేసింది.

ముడి సరుకుల ధరలు, నిర్వహణ వ్యయాలు నిరంతరం పెరుగుతుండటమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని మారుతీ సుజుకీ తెలిపింది. గత కొద్ది నెలలుగా ఖర్చులను తగ్గించుకునేందుకు అనేక చర్యలు తీసుకున్నామని, వ్యయ భారాన్ని వీలైనంత వరకు తామే భరించామని వివరించింది. అయితే, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, ప్రతికూల పరిస్థితుల కారణంగా పెరిగిన ఖర్చుల్లో కొంత భాగాన్ని వినియోగదారులపై బదిలీ చేయక తప్పడం లేదని పేర్కొంది.

తమ పోర్ట్‌ఫోలియోలోని అన్ని మోడళ్లపై ఈ పెంపు వర్తిస్తుందని, అయితే మోడల్‌ను బట్టి పెంపులో వ్యత్యాసం ఉంటుందని కంపెనీ తెలిపింది. వినియోగదారులపై వీలైనంత తక్కువ ప్రభావం చూపేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది.

ఇటీవలి కాలంలో ముడి సరుకులు, రవాణా ఖర్చులు పెరగడంతో పలు ఆటోమొబైల్ కంపెనీలు ఇప్పటికే తమ వాహనాల ధరలను పెంచాయి. ఏప్రిల్‌లో మహీంద్రా అండ్ మహీంద్రా కూడా తమ ఎస్ యూవీలు, వాణిజ్య వాహనాల ధరలను 2.5 శాతం వరకు పెంచిన విషయం తెలిసిందే.