ఈ20 పెట్రోల్‌లో క్లోరైడ్, నీటి కల్తీ ఉందంటూ వస్తున్న వార్తలపై ప్రభుత్వ చమురు సంస్థలు స్పందించాయి. దేశవ్యాప్తంగా నిర్వహించిన విస్తృత పరీక్షల్లో ఇంధనంలో కల్తీ ఉన్నట్లు ఆధారాలు కనిపించలేదని స్పష్టం చేశాయి. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపాయి.
ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం సంస్థలు కలిసి ఈ పరీక్షలు నిర్వహించాయి. శుద్ధి కేంద్రాలు, ఇథనాల్ తయారీ కేంద్రాలు, నిల్వ కేంద్రాలు, రవాణా కేంద్రాలు, పెట్రోల్ బంకుల నుంచి యాదృచ్ఛికంగా నమూనాలు సేకరించారు.
శుద్ధి కేంద్రాల నుంచి తీసుకున్న వందకు పైగా పెట్రోల్ నమూనాలను పరీక్షించగా వాటిలో క్లోరైడ్ స్థాయి ఒక పీపీఎం లేదా అంతకంటే తక్కువగా ఉన్నట్లు సంస్థలు తెలిపాయి. దీంతో శుద్ధి కేంద్రాల నుంచి బయటకు వస్తున్న పెట్రోల్ నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగానే ఉందని పేర్కొన్నాయి.
దేశవ్యాప్తంగా 80 ఇథనాల్ తయారీ కేంద్రాల నుంచి కూడా నమూనాలు సేకరించారు. వాటిలో క్లోరైడ్ స్థాయి మూడు పీపీఎం కంటే తక్కువగా నమోదైనట్లు వెల్లడించారు. పెట్రోల్ కలిపే ముందు ఇథనాల్ నాణ్యతను క్షుణ్ణంగా పరీక్షిస్తున్నట్లు తెలిపారు.
నిల్వ కేంద్రాలు, ట్యాంకర్ రవాణా ప్రాంతాల్లోనూ ఈ20 పెట్రోల్, ఇథనాల్ నమూనాలను పరీక్షించారు. 80కి పైగా నమూనాల్లో క్లోరైడ్ స్థాయి మూడు పీపీఎం కంటే తక్కువగా ఉన్నట్లు తేలింది.
పెట్రోల్ బంకుల్లోనూ తనిఖీలు మరింత పెంచారు. ఇప్పటివరకు వెయ్యికి పైగా నమూనాలు సేకరించగా, పరిశీలించిన 160 నివేదికల్లో క్లోరైడ్ స్థాయి సున్నా నుంచి మూడు పీపీఎం మధ్యలోనే ఉన్నట్లు సంస్థలు తెలిపాయి. ఈ20లో వందల పీపీఎం క్లోరైడ్ ఉందన్న ఆరోపణలకు ఈ ఫలితాలు భిన్నంగా ఉన్నాయని పేర్కొన్నాయి.
అయితే నాలుగు ప్రాంతాల్లో మాత్రం క్లోరైడ్ స్థాయి ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అక్కడ ఇంధన సరఫరాను వెంటనే నిలిపివేశారు. సమస్యకు కారణం ఏంటో తెలుసుకునేందుకు ప్రత్యేకంగా పరిశీలించి, అవసరమైన చర్యలు తీసుకున్న తర్వాతే సరఫరాను పునరుద్ధరించినట్లు సంస్థలు తెలిపాయి.
ఈ20లో నీరు కలిసిందన్న ఆరోపణలపైనా చమురు సంస్థలు వివరణ ఇచ్చాయి. దేశవ్యాప్తంగా సుమారు 90 వేల పెట్రోల్ బంకుల్లో భూగర్భ ఇంధన ట్యాంకులను తనిఖీ చేస్తున్నట్లు తెలిపాయి. నీరు లోపలికి చేరిందా? లేదా? అన్నది ప్రతి బంకులో రోజుకు ఎనిమిది నుంచి పన్నెండు సార్లు పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నాయి.
ఇప్పటివరకు నిర్వహించిన తనిఖీల్లో భూగర్భ ట్యాంకుల్లోకి నీరు చేరినట్లు ఎలాంటి ఆధారాలు కనిపించలేదని స్పష్టం చేశాయి. ఇంధన నాణ్యతపై నిరంతరం నిఘా కొనసాగుతుందని మూడు సంస్థలు వెల్లడించాయి.
ఈ20 పెట్రోల్‌లో క్లోరైడ్, నీరు? చమురు సంస్థల పరీక్షల్లో ఏం తేలింది?
