శరీరానికి తగినంత నీరు అందుతుందా? లేదా? అనేది తెలుసుకోవడానికి దాహం ఒక్కటే కొలమానం కాదంటున్నారు పోషకాహార నిపుణులు. శరీరంలో నీటి సమతుల్యత తగ్గినప్పుడు చర్మం, పెదాలు, మూత్రం, తలనొప్పి వంటి వాటిలో కొన్ని మార్పులు కనిపించవచ్చు. పోషకాహార నిపుణురాలు దీపశిఖా జైన్ సామాజిక మాధ్యమాల్లో పంచుకున్న వివరాల ప్రకారం.. రోజువారీ జీవితంలో గమనించగల ఐదు సంకేతాలతో శరీరానికి తగినంత నీరు సరిపోతుందో లేదో అంచనా వేసుకోవచ్చు.
1. చర్మం వెంటనే సాధారణ స్థితికి వస్తుందా?
చేతి వెనుక భాగంలో కొద్దిగా చర్మాన్ని వేళ్లతో మెల్లగా పైకి లాగి వదలాలి. అది వెంటనే మునుపటి స్థితికి వస్తే సాధారణంగా శరీరంలో నీరు తగినంతగా ఉందని అర్థం. చర్మం కొంతసేపు పైకి లేచినట్టే ఉండిపోతే నీటి కొరతకు సంకేతం కావచ్చని నిపుణురాలు చెబుతున్నారు.
2. పెదాలు పొడిబారుతున్నాయా?
పెదాలు తరచూ పొడిబారి పగిలిపోవడం, పొట్టు ఊడటం వంటివి కనిపిస్తే ద్రవాలు తీసుకోవడంపై దృష్టి పెట్టాలి. తగినంత నీరు తీసుకునే వారిలో పెదాలు సాధారణంగా మృదువుగా, తేమగా ఉంటాయని ఆమె పేర్కొన్నారు.
3. తరచూ తలనొప్పి వస్తుందా?
నీటి కొరత వల్ల కొంతమందిలో తలనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. తరచూ తలనొప్పి లేదా మైగ్రేన్ రావడానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ.. శరీరానికి తగినంత ద్రవాలు అందకపోవడం కూడా వాటిలో ఒకటి కావచ్చని నిపుణురాలు చెబుతున్నారు.
4. మూత్రం రంగు ఎలా ఉంది?
శరీరంలో నీటి స్థాయిని అంచనా వేయడానికి సులభమైన మార్గాల్లో మూత్రం రంగును గమనించడం ఒకటి. సాధారణంగా లేత పసుపు లేదా గడ్డి రంగులో ఉంటే నీరు తగినంతగా తీసుకుంటున్నట్టుగా భావించవచ్చు. ముదురు పసుపు రంగులో ఉంటే ద్రవాల అవసరం ఉండొచ్చని సూచిస్తుంది. అయితే ఎప్పుడూ పూర్తిగా రంగులేనట్టుగా ఉండే మూత్రం మాత్రం అవసరానికి మించి నీరు తాగుతున్నారనే సంకేతం కావచ్చని నిపుణురాలు తెలిపారు.
5. నీరు తాగిన వెంటనే మూత్రానికి వెళ్తున్నారా?
నీళ్లు తాగిన ప్రతిసారీ వెంటనే మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వస్తుంటే.. రోజంతా తీసుకుంటున్న ద్రవాల పరిమాణాన్ని గమనించాలని నిపుణురాలు సూచిస్తున్నారు. నీరు తాగిన తర్వాత శరీరం కొంతసేపు దానిని నిలుపుకోగలగడం సాధారణమేనని ఆమె పేర్కొన్నారు.
మీరు సరిపడా నీళ్లు తాగుతున్నారా? ఈ 5 సంకేతాలతో సులభంగా తెలుసుకోవచ్చు..!
