రెండు కీలక యుద్ధాలు, క్లిష్టమైన దౌత్యపరమైన సవాళ్ల నడుమ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక సమావేశాలు నిర్వహించారు. మంగళవారం వైట్‌హౌస్‌లో ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహులతో వేర్వేరుగా చర్చలు జరిపారు. ప్రపంచ దేశాలను ప్రభావితం చేస్తున్న ఇరాన్, ఉక్రెయిన్ యుద్ధాల నేపథ్యంలో ఈ భేటీలకు ప్రాధాన్యం ఏర్పడింది.
ఈ రెండు సమావేశాలూ ఓవల్ ఆఫీస్‌లో రహస్యంగా జరిగాయి. ప్రెస్‌ను లోనికి అనుమతించలేదు. ఈ భేటీలు సానుకూలంగా, ఫలప్రదంగా ముగిశాయని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్'లో వెల్లడించారు. ఉదయం 9:40 గంటలకు జెలెన్‌స్కీ వైట్‌హౌస్‌కు రాగా, మధ్యాహ్నం 12:25 గంటల తర్వాత నెతన్యాహు అక్కడి నుంచి వెళ్లినట్లు సమాచారం.
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో జరిగిన సమావేశంలో ప్రధానంగా ఇరాన్‌తో యుద్ధం, లెబనాన్‌తో చర్చలు, అబ్రహం ఒప్పందాల విస్తరణ వంటి అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. టెహ్రాన్ అణుకార్యక్రమాలకు సంబంధించిందని భావిస్తున్న "పికాక్స్ మౌంటెన్" అనే భూగర్భ కేంద్రంపై ఇజ్రాయెల్ సేకరించిన నిఘా సమాచారాన్ని నెతన్యాహు.. ట్రంప్‌కు అందించినట్లు సమాచారం. అయితే, ఈ సమాచారాన్ని బయటకు ప్రకటించడంపై ట్రంప్ కాస్త అసహనం వ్యక్తం చేశారు. "ఈ విషయాన్ని నాతో చెబితే సరిపోయేది కదా? ప్రపంచానికి ఎందుకు ప్రకటించాలి?" అని ఫాక్స్ న్యూస్‌తో మాట్లాడుతూ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరాన్ విషయంలో తమ మధ్య కొన్ని భేదాభిప్రాయాలు ఉన్నా, చాలా వరకు ఏకాభిప్రాయంతోనే ఉన్నామని ఆయన అన్నారు. ఒప్పందానికి రాకపోతే ఇరాన్‌లోని వంతెనలు, విద్యుత్ కేంద్రాలపై దాడి చేయగలమని ట్రంప్ మరోసారి హెచ్చరించారు.
మరోవైపు, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో జరిగిన సమావేశంలో రష్యాతో శాంతి చర్చల పునరుద్ధరణ, ఉక్రెయిన్‌కు అమెరికా మద్దతు వంటి అంశాలపై చర్చించారు. ముఖ్యంగా వాయు రక్షణ వ్యవస్థలు, దౌత్యపరమైన చర్చల గురించి ట్రంప్‌తో మాట్లాడినట్లు జెలెన్‌స్కీ తర్వాత తెలిపారు. రష్యాపై ఆంక్షలు, డ్రోన్ ఒప్పందం, పాట్రియాట్ క్షిపణి వ్యవస్థలపై పురోగతి సాధించే లక్ష్యంతో ఆయన వాషింగ్టన్ వచ్చారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడంలో నిర్మాణాత్మక పాత్ర పోషించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, శాంతి ఒప్పందం కుదురుతుందనే ఆశాభావంతో ఉన్నామని వైట్‌హౌస్ ఒక ప్రకటనలో పేర్కొంది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో ఇజ్రాయెల్, ఉక్రెయిన్ అధినేతల భేటీ..
