పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ శుక్రవారం ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చీతో ఫోన్‌లో మాట్లాడారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా వాణిజ్య నౌకలు, నావికులపై దాడులు జరగకూడదని ఈ సందర్భంగా ఆయన గట్టిగా స్పష్టం చేశారు.

పెరుగుతున్న సంఘర్షణల పట్ల భారత్ ఆందోళనను ఆయన వ్యక్తం చేశారు. చర్చలు, దౌత్య మార్గాలకే భారత్ ఎల్లప్పుడూ మద్దతిస్తుందని పునరుద్ఘాటించారు. వాణిజ్య నౌకలపై ఏ పక్షం దాడులు చేసినా భారత్ ఖండిస్తుందని, సముద్ర వాణిజ్య మార్గాల భద్రత చాలా ముఖ్యమని ఆయన పేర్కొన్నారు.

ఈ ఏడాది ఫిబ్రవరిలో పశ్చిమాసియాలో సంఘర్షణలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 16 మంది భారతీయులు మరణించారని, మరో 75 మంది గాయపడ్డారని ప్రభుత్వం వెల్లడించింది. మృతుల్లో 10 మంది నావికులు ఉన్నారు. సౌదీ అరేబియాలో ఒకరు, కువైట్‌లో ఇద్దరు, ఒమన్‌లో ఎనిమిది మంది, ఇరాక్‌లో ఒకరు, యూఏఈలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

ఈ పరిణామాల నేపథ్యంలో, ప్రధాని నరేంద్ర మోదీ గురువారం భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం నిర్వహించారు. సంఘర్షణ ప్రాంతాల్లో పనిచేస్తున్న భారత నావికుల భద్రతపై సమీక్షించారు. నావికులకు, వారి కుటుంబాలకు సకాలంలో సమాచారం, అత్యవసర సహాయం, కౌన్సెలింగ్ అందించేందుకు ఒక ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని సంబంధిత మంత్రిత్వ శాఖలను ప్రధాని ఆదేశించారు.