ప్రధాని నరేంద్ర మోదీ శనివారం భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ టెర్మినల్ భవనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్‌ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్, కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు హాజరయ్యారు.

అంతకుముందు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రధాని ఇతర ప్రముఖులు టెర్మినల్ భవనాన్ని సందర్శించారు. అక్కడి ఆధునిక సదుపాయాలను, సాంకేతిక ప్రత్యేకతలను పరిశీలించారు.

ఈ సందర్భంగా జీఎమ్మార్ సంస్థ ప్రతినిధులు విమానాశ్రయ రూపకల్పన, చెక్-ఇన్ హాల్, ఇతర విశేషాలను ప్రధాని మోదీకి వివరించారు. ఎయిర్‌పోర్ట్ మాస్టర్ ప్లాన్, ఏవియేషన్ హబ్, ఏవియేషన్ ఎడ్యుసిటీ నమూనాలను కూడా ప్రధాని ఆసక్తిగా తిలకించారు. ఈ నూతన టెర్మినల్ ప్రారంభంతో ఉత్తరాంధ్ర ప్రాంతంలో విమానయాన సేవలు మరింత విస్తృతం కానున్నాయి.