పాకిస్థాన్‌లోని కరాచీ నగరంలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. ఒకప్పటి కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్ ఉజైర్ బలోచ్ సోదరుడు జుబైర్ బలోచ్‌పై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. నిన్న‌ జరిగిన ఈ దాడిలో జుబైర్ తీవ్రంగా గాయపడగా, అటుగా వెళుతున్న మరో ఇద్దరు పాదచారులు కూడా గాయపడ్డారు. ఈ ఘటనతో ఒకప్పుడు గ్యాంగ్ వార్‌లతో అట్టుడికిన ల్యారీలో ప్రాంతంలో మళ్లీ హింస చెలరేగుతుందనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

'డాన్' పత్రిక కథనం ప్రకారం కరాచీలోని ల్యారీ ప్రాంతంలో ఉన్న తన ఇంటి బయట జుబైర్ (40) కూర్చుని ఉండగా ఈ దాడి జరిగింది. మోటార్‌సైకిల్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు అతనిపై కాల్పులు జరిపి వేగంగా పరారయ్యారని సౌత్ డీఐజీ సయ్యద్ అసద్ రజా తెలిపారు. ఈ కాల్పుల్లో జుబైర్ ఛాతీ, పొత్తికడుపు భాగాల్లోకి బుల్లెట్లు దూసుకెళ్లాయని, అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. గాయపడిన జుబైర్‌తో పాటు మిగతా ఇద్దరినీ చికిత్స కోసం సివిల్ హాస్పిటల్‌కు తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గ్యాంగ్ తగాదాలు, పాత కక్షల కోణంలో విచారణ జరుపుతున్నారు. జుబైర్‌పై 2012లో ఏడు క్రిమినల్ కేసులు నమోదయ్యాయని, అతను 2025 జనవరిలో జైలు నుంచి విడుదలయ్యాడని పోలీసులు వెల్లడించారు. అతని గతం లేదా ప్రస్తుత వివాదాలే ఈ దాడికి కారణమా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

తిరిగి పాత రోజులు వస్తాయనే ఆందోళన
ఈ దాడి ఘటనతో ల్యారీ వాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. కరాచీలో ఆపరేషన్ జరిగినప్పుడు దుబాయ్, ఇరాన్‌లకు పారిపోయిన అనేకమంది గ్యాంగ్‌స్టర్లు ఇటీవల తిరిగి వస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. జుబైర్ కూడా కొన్ని నెలల క్రితం ఓ రాజకీయ పార్టీలో చేరాడని, ఆ పార్టీ జెండాలను ప్రాంతంలో ఏర్పాటు చేశాడని ఓ సామాజిక కార్యకర్త తెలిపారు. దుండగులు ముఖాలకు ముసుగులు ధరించి దాడి చేశారని, సమీపంలోని ఓ దుకాణదారుడు ఎదురుకాల్పులు జరపడంతో వారు పారిపోయారని చెబుతున్నారు.

కాగా, ఉజైర్ బలోచ్ ల్యారీ ప్రాంతంలో పేరుమోసిన గ్యాంగ్‌స్టర్‌గా ఉండేవాడు. గూఢచర్యం కేసులో 2020లో సైనిక కోర్టు అతనికి 12 ఏళ్ల జైలు శిక్ష విధించింది. హత్యలు, పోలీసులపై దాడులు వంటి అనేక కేసుల్లో అతను నిందితుడిగా ఉన్నాడు. ఈ ఏడాది మార్చిలో కూడా ఏడు కేసుల్లో అతని బెయిల్ పిటిషన్లను యాంటీ-టెర్రరిజం కోర్టు తిరస్కరించింది. తాజా ఘటనతో ల్యారీలో మళ్లీ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.