ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వం తీసుకొచ్చిన ‘దిశ’ చట్టం బిల్లును వెనక్కి తీసుకుంటూ కూటమి ప్రభుత్వం కేబినెట్‌లో నిర్ణయం తీసుకోవడంపై వైసీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నిర్ణయంపై స్పందించిన వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి... హోంమంత్రి అనిత ఒక ‘డమ్మీ’ హోంమంత్రిగా మారారని తీవ్రస్థాయిలో విమర్శిస్తూ, ఆమె తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మాజీ సీఎం జగన్ పై ఉన్న కక్షతోనే దిశ చట్టాన్ని రద్దు చేశారని ఆరోపించారు.
మహిళలకు రక్షణగా నిలిచే దిశ చట్టాన్ని రద్దు చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర మహిళలకు క్షమాపణ చెప్పాలని కల్యాణి డిమాండ్ చేశారు. కావాలంటే చట్టం పేరు మార్చినా తమకు అభ్యంతరం లేదని, కానీ మహిళల రక్షణ కోసం ఆ చట్టాన్ని యథాతథంగా కొనసాగించాలని కోరారు.
