తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ద్వేషపూరిత ప్రసంగం కేసులో పోలీసుల విచారణకు హాజరుకావాలన్న కలకత్తా హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించేందుకు న్యాయస్థానం నిరాకరించింది. విచారణకు హాజరైతే తనపై గుడ్లు విసురుతారనే ఆందోళనతో మినహాయింపు కోరడంపై ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ షీల్ నాగులతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. మహువా తరఫున సీనియర్ న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ వాదనలు వినిపిస్తూ, నియోజకవర్గంలోని పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరుకావాలని పోలీసులు నోటీసులు జారీ చేశారని తెలిపారు. గతంలో ఆమె పర్యటనల సమయంలో నిరసనకారులు గుడ్లు విసిరిన ఘటనలు ఉన్నాయని, ఈ నేపథ్యంలో వర్చువల్ విధానంలో విచారణకు అనుమతించాలని కోరారు.
దీనిపై ధర్మాసనం స్పందిస్తూ, "మీరు ఒక పార్లమెంటు సభ్యురాలు. రాజకీయాల్లో ఉన్నవారు ఇలా గుడ్లు విసురుతారనే భయంతో విచారణకు గైర్హాజరవుతారా? మన స్వాతంత్ర్య సమరయోధులు దేశం కోసం తూటాలను సైతం ఎదుర్కొన్నారు. ఇలాంటి పిటిషన్లు అత్యున్నత న్యాయస్థానం ముందుకు రాకూడదు" అని ఘాటుగా వ్యాఖ్యానించింది. కోర్టు వైఖరిని గమనించిన మహువా తరఫు న్యాయవాది తన పిటిషన్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు. దీంతో పిటిషన్‌ను ఉపసంహరించుకున్నట్లు పరిగణిస్తూ కోర్టు దానిని కొట్టివేసింది.
రాజకీయాల్లోకి వచ్చాక గుడ్లకు భయమా?: మహువా మొయిత్రాపై సుప్రీం ఆగ్రహం..
