రాష్ట్రంలోని చేనేత కార్మికులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా ఇచ్చారు. 12వ జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని, బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గం కొత్తపేట గ్రామంలో 'నేతన్న సేవలో' అనే కొత్త పథకాన్ని ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 71,536 చేనేత కుటుంబాలకు రూ. 25,000 చొప్పున ఆర్థిక సహాయం అందించేందుకు రూ. 179 కోట్లను విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, స్వదేశీ ఉద్యమ స్ఫూర్తిని గుర్తుచేసుకునే ఆగస్టు 7వ తేదీని మరపురాని రోజుగా మార్చాలనే సంకల్పంతో ఈ పథకాన్ని ప్రారంభించామని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలే కాకుండా, చెప్పని వాటిని కూడా అమలు చేస్తున్నామనడానికి 'నేతన్న సేవలో' పథకమే నిదర్శనమని ఆయన స్పష్టం చేశారు. 

చేనేత కేవలం ఒక వృత్తి కాదని, అది భారతీయ సంస్కృతికి, దేశం గర్వించదగ్గ కళకు ప్రతీక అని కొనియాడారు. ఒకప్పుడు చేనేత ఉత్పత్తులతో 'మినీ ముంబై'గా పేరుగాంచిన చీరాలకు తిరిగి పూర్వ వైభవం తీసుకొస్తామని హామీ ఇచ్చారు.

రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చేనేత వర్గాల సంక్షేమానికి పలు పథకాలు అమలు చేస్తోందని చంద్రబాబు వివరించారు. చేనేత కార్మికులకు 50 ఏళ్లకే ఎన్టీఆర్ భరోసా కింద రూ. 4,000 పింఛను అందిస్తున్నామని, దీని ద్వారా 85 వేల మందికి ఏటా రూ. 420 కోట్లు అందిస్తున్నామని తెలిపారు. 

అదేవిధంగా, చేనేత కుటుంబాలకు నెలకు 200 యూనిట్లు, పవర్‌లూమ్‌లకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నామని, దీనివల్ల 62,541 చేనేత కుటుంబాలు, 10,032 పవర్‌లూమ్ యూనిట్లు లబ్ధి పొందుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలోని 109 ప్రాథమిక చేనేత సహకార సంఘాలకు క్యాష్ క్రెడిట్ రూపంలో రూ. 79 కోట్లు అందించామన్నారు.

చేనేత రంగ అభివృద్ధికి ప్రభుత్వం దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకెళుతోందని ముఖ్యమంత్రి తెలిపారు. స్మాల్ క్లస్టర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం కింద రూ. 10 కోట్లతో 10 చేనేత క్లస్టర్లకు ఆమోదం తెలిపామని, హ్యాండ్లూమ్ మార్కెటింగ్ అసిస్టెన్స్ కార్యక్రమం ద్వారా కార్మికులకు నేరుగా మార్కెట్ అవకాశాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. 

మంగళగిరిలో హ్యాండ్లూమ్ పార్కు, ఉప్పాడలో ప్రత్యేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టు, అమరావతిలోని శాఖమూరులో చేనేత, హస్తకళల మ్యూజియం ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. 

విశాఖపట్నంలో రూ. 4,200 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు కానున్న టెక్స్‌టైల్ రీసైక్లింగ్ యూనిట్ ద్వారా చేనేత రంగానికి మరింత ఊపు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

ఈ కార్యక్రమంలో మంత్రులు సవిత, గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్ధసారధి తదితరులు