భారత్‌కు చెందిన రేణు ధరియాల్ ప్రపంచంలోనే అత్యంత పొడవైన జుట్టు కలిగిన మహిళగా గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించారు. ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో ఆమె జుట్టు పొడవును అధికారికంగా కొలవగా, అది 271.50 సెంటీమీటర్లు (8 అడుగుల 10 అంగుళాలు) ఉన్నట్టు నిర్ధారించారు. దీంతో ఆమె పేరు గిన్నిస్ బుక్‌లో నమోదైంది.

ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈ రికార్డును అధికారులు ధ్రువీకరించారు. దీంతో ఉక్రెయిన్‌కు చెందిన అలియా నసిరోవా (257.33 సెం.మీ.) పేరిట ఉన్న పాత రికార్డు బద్దలైంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ప్రపంచంలోనే అత్యంత పొడవైన వ్యక్తిగా రికార్డులకెక్కిన రాబర్ట్ వాడ్లో (272 సెం.మీ.) ఎత్తుకు రేణు జుట్టు పొడవు కేవలం కొద్దిగా మాత్రమే తక్కువ.

రేణు ధరియాల్ వృత్తిరీత్యా ఒక కంటెంట్ క్రియేటర్, యూట్యూబర్. మహిళలకు అందం, జుట్టు సంరక్షణపై చిట్కాలు అందిస్తుంటారు. భారతీయ సంస్కృతిలో పొడవాటి జుట్టును అందానికి, సంప్రదాయానికి చిహ్నంగా భావిస్తారని, అదే తనకు స్ఫూర్తినిచ్చిందని రేణు తెలిపారు. 2015 నుంచి జుట్టును పెంచుతున్నానని, అప్పటి నుంచి ఒక్కసారి కూడా కత్తిరించలేదని ఆమె వివరించారు.

ఇంత పొడవాటి జుట్టును సంరక్షించడం చాలా ఓపికతో కూడుకున్న పని అని రేణు చెప్పారు. జుట్టును శుభ్రం చేయడానికి, చిక్కులు తీయడానికి గంటల సమయం పడుతుందని అన్నారు. నేలపై పడకుండా ఉండేందుకు తన ఒత్తైన, నిగనిగలాడే జుట్టును పెద్ద జడగా అల్లుకుంటానని ఆమె పేర్కొన్నారు.