తమిళనాడులో నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్)పై ముఖ్యమంత్రి విజయ్ ఏర్పాటు చేసిన ఎంపీల సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు డీఎంకే ప్రకటించింది. డీలిమిటేషన్ అంశంపై ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు తమ స్పష్టమైన వైఖరిని తెలియజేశాయని, అలాంటప్పుడు టీవీకే ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ భేటీ కేవలం ఒక 'రాజకీయ డ్రామా' మాత్రమే అని డీఎంకే సీనియర్ నాయకురాలు, ఎంపీ కనిమొళి విమర్శించారు.

 

కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే డీలిమిటేషన్ వల్ల జనాభా నియంత్రణ పాటించిన తమిళనాడు వంటి దక్షిణాది రాష్ట్రాల ఎంపీ సీట్ల సంఖ్య తగ్గి తీవ్ర అన్యాయం జరుగుతుందనే ఆందోళనపై విజయ్ రాష్ట్ర ఎంపీలతో చర్చించేందుకు ఈ సమావేశాన్ని పిలిచారు. అయితే, డీలిమిటేషన్‌పై గతంలోనే స్పష్టమైన తీర్మానాలు ఉన్నాయని, దీనికంటే కావేరి నీటి విడుదల, మేకెదాటు ప్రాజెక్టుపై తమిళనాడు వైఖరిని బలంగా వినిపించేందుకు ఆల్-పార్టీ సమావేశం పెట్టడమే తక్షణ అవసరమని డీఎంకే నేతలు వ్యాఖ్యానించారు. డీఎంకేతో పాటు అన్నాడీఎంకే సహా పలు విపక్ష పార్టీలు కూడా ఈ భేటీకి దూరంగా ఉండాలని నిర్ణయించాయి.