ఆస్ట్రేలియా మహిళా క్రికెట్‌లో పెద్ద వివాదం రాజుకుంది. గతంలో స్వలింగ వివాహం చేసుకున్న జట్టు వైస్ కెప్టెన్ ఆష్లే గార్డనర్‌పై ఆమె మాజీ భార్య మోనికా రైట్ సంచలన ఆరోపణలు చేసింది. సహచర ప్లేయర్ జార్జియా వోల్‌తో గార్డనర్‌కు వివాహేతర సంబంధం ఉందని ఆరోపించిన రైట్, ఆమెను తక్షణమే వైస్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది. ఈ వ్యవహారంలో క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఎందుకు మౌనంగా ఉంటోందంటూ ఆమె ప్రశ్నించింది.
కోడ్ స్పోర్ట్స్‌తో మాట్లాడిన మోనికా రైట్.. "దేశానికి ప్రాతినిధ్యం వహించే గౌరవం దక్కినప్పుడు, రోల్ మోడల్‌గా ఉన్నప్పుడు ఉన్నత నైతిక విలువలను పాటించాల్సిన బాధ్యత ఉంటుంది. ఈ విషయంలో క్రికెట్ ఆస్ట్రేలియా ఎందుకు బహిరంగంగా స్పందించడం లేదో నాకు అర్థం కావడం లేదు. వారి మౌనం ఆష్లే, జార్జియా చర్యలను సమర్థించినట్లేనా? జూనియర్ సభ్యురాలితో ఎఫైర్ పెట్టుకుని, నాయకత్వ పదవిలో ఎలా కొనసాగుతారు? కెప్టెన్లు ప్రమాణాలను నెలకొల్పాలి, కానీ ఈ ప్రవర్తన అందుకు విరుద్ధంగా ఉంది" అని రైట్ తీవ్రంగా విమర్శించింది.
ఈ ఆరోపణలపై క్రికెట్ ఆస్ట్రేలియా స్పందిస్తూ.. ఇది 'వ్యక్తిగత విషయం' అని పేర్కొంది. "మా సిబ్బంది మధ్య అన్ని సంబంధాలు మా 'రెస్పెక్ట్ ఎట్ వర్క్' పాలసీకి అనుగుణంగా ఉండేలా చూసుకుంటాం. నాయకత్వ బాధ్యతలకు మద్దతుగా, జట్టు ప్రక్రియల సమగ్రతను కాపాడటానికి అవసరమైన కాన్ఫ్లిక్ట్-ఆఫ్-ఇంటరెస్ట్ ఏర్పాట్లు కూడా ఇందులో భాగంగా ఉంటాయి" అని సీఏ ఒక ప్రకటనలో తెలిపింది.
'డైలీ మెయిల్' కథనం ప్రకారం.. ఆష్లే గార్డనర్, మోనికా రైట్‌లకు 2025 ఏప్రిల్ లో స్వలింగ వివాహం జరిగింది. 2025లో భారత్‌లో జరిగిన మహిళల వన్డే ప్రపంచకప్ సమయంలో గార్డనర్, జార్జియా వోల్‌తో సంబంధం పెట్టుకుందని రైట్ ఆరోపించడంతో వీరి బంధం దెబ్బతింది. అప్పటి నుంచి వీరిద్దరూ విడిపోయారు.
ఈ వివాదం నడుమ గార్డనర్‌కు ఆమె ఉమెన్స్ బిగ్ బాష్ లీగ్ (డబ్ల్యూబీబీఎల్) ఫ్రాంచైజీ సిడ్నీ సిక్సర్స్ మద్దతుగా నిలిచింది. సిక్సర్స్ జీఎం, ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్ రాచెల్ హేన్స్ మాట్లాడుతూ.. "ఆమె వ్యక్తిగత జీవితంపై నేను వ్యాఖ్యానించను. నేను ఆమెతో టచ్‌లో ఉన్నాను. మేము ఆమెకు మద్దతుగా ఇక్కడ ఉన్నామని ఆమెకు తెలుసు. మా క్లబ్‌లో ఆమె ఒక ముఖ్యమైన, గౌరవనీయమైన క్రీడాకారిణి" అని తెలిపింది.
ఆసీస్ క్రికెట్‌లో కలకలం.. మహిళా జట్టు వైస్ కెప్టెన్ గార్డనర్‌పై మాజీ భార్య సంచలన ఆరోపణలు..
