లోహగఢ్ కోటపై జరిగిన పూణె వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో ప్రధాన నిందితురాలైన సియా గోయల్ తల్లిదండ్రులు తొలిసారి నోరు విప్పారు. తమ కూతురిపై వస్తున్న ఆరోపణలపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆమె తల్లి పూజా గోయల్, తండ్రి ప్రవీణ్ గోయల్.. ఈ కేసులో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ దర్యాప్తులో తమ కూతురు దోషిగా తేలితే ఆమెను కూడా అదే కోటపై నుంచి కిందకు తోసేయాలని, అంతటి కఠిన శిక్ష పడినా తమకు అభ్యంతరం లేదని స్పష్టం చేశారు.

కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గత ఫిబ్రవరిలో కేతన్, సియాల నిశ్చితార్థం ఇరు కుటుంబాల సమక్షంలో ఎంతో ఘనంగా జరిగింది. "సియా నిశ్చితార్థానికి ముందే మేము ఆమెను పదే పదే అడిగాం. ప్రతిసారీ తను కేతన్ అంటే ఇష్టమని, ఈ పెళ్లికి పూర్తి అంగీకారంతో ఉన్నానని చెప్పింది. తన ప్రేమాయణాన్ని దాచిపెట్టింది’’ అని తల్లి పూజ తెలిపారు. ఈ కేసులో రెండో నిందితుడిగా ఉన్న చేతన్ చౌదరి కేవలం తమ కూతురికి స్నేహితుడిగా మాత్రమే తెలుసని, వారి మధ్య ప్రేమ ఉందనే విషయం పోలీసుల దర్యాప్తు ద్వారానే తమకు తెలిసిందని వారు వెల్లడించారు.

మరోవైపు కేతన్ కుటుంబం మాత్రం ఈ వాదనలను తోసిపుచ్చుతోంది. సియాకు చేతన్‌తో ఉన్న సంబంధం ఆమె తల్లిదండ్రులకు ముందే తెలుసని, తమ కుటుంబానికి ఉన్న ఆర్థిక నేపథ్యం (ఆస్తిపాస్తులు) చూసి సియాపై వారు ఈ పెళ్లి కోసం ఒత్తిడి తెచ్చారని కేతన్ తండ్రి విశాల్ అగర్వాల్ ఆరోపించారు. సియా వయసు చిన్నదైనప్పటికీ వారి కుటుంబం పదే పదే కోరడం వల్లే తాము పెళ్లికి ఒప్పుకున్నామని ఆయన పేర్కొన్నారు.

మరోవైపు, పోలీస్ కస్టడీలో ఉన్న సియా, చేతన్‌లు ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నారు. ఇంట్లో వాళ్ల ఒత్తిడి వల్లే తాను కేతన్‌ను పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని సియా చెబుతుండగా.. కుటుంబ పరువు పోతుందనే భయంతోనే తాము వెళ్లిపోలేకపోయామని చేతన్ అంటున్నాడు. అంతకుముందు నాలుగు రోజుల క్రితమే ఒకసారి కోటపై పాము నెపంతో కేతన్‌ను చంపేందుకు విఫలయత్నం చేసినట్లు కూడా పోలీసుల విచారణలో తేలింది.

కేతన్ తమకు కొడుకు లాంటివాడని, ఒక అమాయకుడి ప్రాణం తీసిన వారు ఎవరైనా సరే చట్టం ముందు కఠినంగా శిక్షించబడాలని సియా తండ్రి ప్రవీణ్ గోయల్ డిమాండ్ చేశారు. ప్రస్తుతం నిందితులిద్దరూ జూన్ 29 వరకు పోలీస్ కస్టడీలో ఉన్నారు.