మన దైనందిన జీవితంలో ఎవరైనా చిన్న సాయం చేసినప్పుడు ‘థాంక్యూ’ చెప్పడం ఒక మంచి అలవాటు, కనీస మర్యాద. అయితే, కొందరు చాలా చిన్న విషయాలకు కూడా పదే పదే, అతిగా కృతజ్ఞతలు చెబుతుంటారు. ఇది కేవలం వారి మంచి నడవడికకు మాత్రమే నిదర్శనం కాదని, వారి మనసులోని లోతైన అభద్రతాభావానికి లేదా ఆశ్చర్యానికి సంకేతం కావచ్చని తాజా సైకలాజికల్ విశ్లేషణలు చెబుతున్నాయి.

మానసిక శాస్త్రవేత్తల పరిశోధనల ఆధారంగా ‘లైఫ్‌స్టైల్ జర్నల్స్‌’లో ప్రచురితమైన కథనాల ప్రకారం.. ఒక వ్యక్తి చిన్న సాయానికే విపరీతంగా కృతజ్ఞతలు చెబుతున్నాడంటే, దానికి కారణం ఎలాంటి షరతులు లేకుండా తనకు సాయం అందడంపై అతను లోలోపల తీవ్ర ఆశ్చర్యానికి గురికావడమే. సాధారణంగా గతంలో వారు పొందిన సాయాల వెనుక ఏదో ఒక స్వార్థం, తిరిగి ఏదో ఒకటి ఆశించడం లేదా ఒత్తిడి వంటి చేదు అనుభవాలు ఉండి ఉండవచ్చు. అలాంటి వారు ఎటువంటి లాభాపేక్ష లేని నిస్వార్థమైన సాయాన్ని అందుకున్నప్పుడు, ఆ నిజాన్ని అంత తేలికగా నమ్మలేరు.

ప్రముఖ సైకాలజిస్ట్ సారా అల్గో చెప్పిన ‘ఫైండ్, రిమైండ్, అండ్ బైండ్’ సిద్ధాంతం ప్రకారం.. ఇలా పదే పదే థాంక్స్ చెప్పడం అనేది అవతలి వ్యక్తి చూపించిన నిజమైన ప్రేమను, కేరింగ్‌ను గుర్తించడానికి మనసు చేసే ప్రయత్నం. ఒక ఆఫీస్ కొలీగ్ తనకు చెప్పకుండానే హెల్ప్ చేసినా, లేదా స్నేహితులు ఆశించకుండా సాయం చేసినా.. గతంలో కండిషన్లతో కూడిన సాయానికి అలవాటు పడిన మనసు ఒక్కసారిగా నమ్మలేకపోతుంది. ఆ సమయంలో వారి మనసులో తలెత్తే అపనమ్మకానికి, కృతజ్ఞతకు మధ్య సమతుల్యతను సాధించడానికి వారు పదే పదే థాంక్స్ చెబుతుంటారు.

పరిశోధనల ప్రకారం సాధారణంగా కృతజ్ఞతా భావం కలిగి ఉండటం అనేది మానసిక ఆరోగ్యానికి, బంధాలు బలపడటానికి ఎంతో మంచిది. కానీ, ఆ కృతజ్ఞత అనేది అవసరానికి మించి ఉన్నప్పుడు మాత్రం.. అది సదరు వ్యక్తి గతంలో ఎదుర్కొన్న మానసిక ఒత్తిడిని లేదా ప్రస్తుత బంధంపై ఉన్న నమ్మకరాహిత్యాన్ని సూచిస్తుంది. తాను అవతలి వ్యక్తికి రుణపడిపోయానేమో అనే ఆందోళనను తగ్గించుకోవడానికి కూడా ఈ ‘అతి థాంక్స్’ ఒక సాధనంగా మారుతుంది.

సోషల్ మీడియాలో ఈ అంశంపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎంతో మంది నెటిజన్లు తమకు కూడా ఇలాంటి అలవాటు ఉందని, గతంలో తమకు ఎదురైన కొన్ని సంఘటనల వల్లే తాము ఇలా మారినట్లు అంగీకరిస్తున్నారు. అయితే, సైకాలజిస్టులు దీనిని ఒక పెద్ద లోపంగా లేదా మానసిక సమస్యగా చూడాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తున్నారు. మనుషుల మధ్య ఉండే బంధాలు, వారి గత అనుభవాల ఆధారంగా మనస్తత్వాలు ఎలా మారుతుంటాయో చెప్పడానికి ఇదొక చక్కటి ఉదాహరణ మాత్రమేనని చెబుతున్నారు.