ప్రస్తుత పోటీ ప్రపంచంలో మంచి జీతంతో కూడిన ఉద్యోగం దొరకడమే గగనం. అలాంటిది గూగుల్, మైక్రోసాఫ్ట్, యూట్యూబ్ వంటి ప్రపంచ ప్రఖ్యాత సంస్థల్లో పనిచేస్తూ, ఏడాదికి రూ.4.25 కోట్ల జీతం అందుకుంటున్న ఓ వ్యక్తి.. ఆ ఉద్యోగాన్ని వదిలేసి రెస్టారెంట్ పెట్టుకున్నాడంటే నమ్మగలమా? కానీ ఇది నిజం. అమెరికాలోని టెక్సాస్‌లో సలాహుద్దీన్ అబ్దుల్-కఫీ అనే 35 ఏళ్ల వ్యక్తి ఈ సాహసం చేసి, ఇప్పుడు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు.

టెక్ ప్రపంచంపై విరక్తితో..
దాదాపు 14 ఏళ్ల పాటు టెక్ పరిశ్రమలో పనిచేసిన అబ్దుల్-కఫీ, ఆ రంగంపై పూర్తి నిరాశకు గురయ్యాడు. టెక్ కంపెనీల ప్రధాన లక్ష్యం ప్రజల జీవితాలను మెరుగుపరచడం కాకుండా, కేవలం డబ్బు సంపాదించడంపైనే ఉందని గ్రహించాడు. ఈ ధోరణి నచ్చకే శాన్ ఫ్రాన్సిస్కోలోని తన ఉన్నత ఉద్యోగానికి రాజీనామా చేశాడు. జీతంలో ఏకంగా 50 శాతానికి పైగా కోతను అంగీకరించి, ఒక మతపరమైన స్వచ్ఛంద సంస్థలో చేరాడు.

స్నేహితుల ప్రోత్సాహంతో వ్యాపారం ప్రారంభం
స్వచ్ఛంద సంస్థలో పనిచేస్తూనే, తనకిష్టమైన వంటపై దృష్టి పెట్టాడు. స్నేహితుల కోసం తరచూ ఇంట్లో విందులు, బార్బిక్యూ పార్టీలు ఏర్పాటు చేసేవాడు. ముఖ్యంగా అతను తయారుచేసే హలాల్ బ్రిస్కెట్స్ (ఒక రకమైన బార్బిక్యూ మాంసం) రుచి చూసిన స్నేహితులు, ఇంతకుముందెన్నడూ ఇలాంటి వంటకం తినలేదని ప్రశంసించేవారు. అప్పుడే అబ్దుల్-కఫీకి ఒక ఆలోచన వచ్చింది.

"టెక్సాస్ బార్బిక్యూలో లేని కొత్తదనాన్ని అందించగలనేమో అనిపించింది. స్నేహితులు నా వంటను మెచ్చుకుంటున్నప్పుడు, దీనికి మార్కెట్లో ఆదరణ ఉంటుందని నమ్మాను," అని అబ్దుల్-కఫీ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ ఆలోచనతోనే 2024 డిసెంబర్‌లో 'కఫీ BBQ' పేరుతో ఒక హలాల్ బార్బిక్యూ రెస్టారెంట్‌ను ప్రారంభించాడు.

ఊహించని విజయం.. కోట్లలో ఆదాయం
ప్రారంభించిన రోజునే ఊహించని స్పందన లభించింది. మూడు రోజులకు సరిపడా సిద్ధం చేసుకున్న బార్బిక్యూ మొత్తం కేవలం ఒక్క రోజులోనే అమ్ముడుపోయింది. ఆ రాత్రే మళ్లీ వంట మొదలుపెట్టి, మరుసటి రోజుకు సిద్ధం చేయాల్సి వచ్చిందని అబ్దుల్-కఫీ గుర్తుచేసుకున్నాడు. కొద్దికాలంలోనే అతని రెస్టారెంట్ టెక్సాస్ రాష్ట్రవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది.

గతేడాది అతని రెస్టారెంట్ ఆదాయం రూ.21.7 కోట్లు కాగా, ఈ ఏడాది అది రూ.37.8 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. అయితే, ఈ భారీ ఆదాయం వెనుక కఠోర శ్రమ, ఆర్థిక సవాళ్లు కూడా ఉన్నాయి. "రెస్టారెంట్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు నా జీతంగా ఒక్క డాలర్ కూడా తీసుకోలేదు. నా పొదుపు డబ్బుతోనే జీవిస్తున్నాను" అని అతను వివరించాడు.

రెస్టారెంట్ ఏర్పాటుకు సుమారు  (సుమారు రూ. 9.4 కోట్లు) ఖర్చయిందని, ఆ పెట్టుబడి ఇంకా తిరిగి రాలేదని చెప్పాడు. ఆహారానికి రూ.1.18 కోట్లు, సిబ్బంది జీతాలకు రూ. 47.38 ల‌క్ష‌లు, అద్దెకు రూ. 14.21ల‌క్ష‌లు సహా మార్కెటింగ్, ఇతర ఖర్చులతో కలిపి నెలకు సుమారు రూ.2.03 కోట్లు ఖర్చవుతుందని తెలిపాడు. అయినప్పటికీ ఇష్టమైన పనిలో దొరికే సంతృప్తి ముందు ఈ కష్టం ఏమాత్రం కాదని అబ్దుల్-కఫీ నమ్మకంగా చెబుతున్నాడు.