మనకున్న సమస్యలే పెద్దవని అనిపించడం చాలా సహజం. కానీ, కొందరి జీవితాలు చూస్తే మన కష్టాలు చాలా చిన్నవిగా కనిపిస్తాయి. బెంగళూరుకు చెందిన సిద్ధార్థ్ అనే వ్యక్తికి కూడా అలాంటి అనుభవమే ఎదురైంది. ఇటీవల క్యాబ్‌లో ప్రయాణిస్తున్న సమయంలో డ్రైవర్ చెప్పిన తన జీవిత కథ విన్న తర్వాత తన సమస్యలన్నీ చాలా చిన్నవిగా అనిపించాయని ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ పోస్ట్ ఇప్పుడు వేలాదిమందిని భావోద్వేగానికి గురిచేస్తోంది.
32 ఏళ్ల ఆ క్యాబ్ డ్రైవర్‌కు ముగ్గురు పిల్లలున్నారు. ప్రేమించిన అమ్మాయినే 11 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం కుటుంబంలో సంపాదించే వ్యక్తి ఒక్కరే. భార్య, పిల్లలతో పాటు తల్లిని కూడా ఆయనే పోషిస్తున్నారు. క్యాబ్ డ్రైవర్‌గా మారే ముందు ఎన్నో రకాల ఉద్యోగాలు చేశాడు. ప్రస్తుతం రోజుకు సుమారు రూ.1,200 సంపాదిస్తున్నానని చెప్పాడు. అన్ని బాధ్యతల మధ్య కూడా ప్రతి నెలా ఒకసారి కుటుంబ సభ్యులను బయటకు తీసుకెళ్లి బిర్యానీ తినిపించడం తనకు ఎంతో ఆనందాన్నిస్తుందని చెప్పడం సిద్ధార్థ్‌ను కదిలించింది.
అయితే, అతడు చెప్పిన మరో విషయం మరింత కలచివేసింది. కుటుంబ బాధ్యతల ఒత్తిడితో ఎన్నోసార్లు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన వచ్చిందని వాపోయాడు. కానీ తన కుటుంబం కోసం ఆ ఆలోచనను విరమించుకున్నానని తెలిపాడు. బాధ్యతల భారం తనను లోపల నుంచి తినేస్తున్నా, బయట మాత్రం నవ్వుతూ జీవితం సాగిస్తున్నానని చెప్పిన మాటలు సిద్ధార్థ్‌ను తీవ్రంగా ఆలోచింపజేశాయి.
ఈ పోస్టుపై నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందించారు. ఇలాంటి కథలు తమకు ఉన్న సౌకర్యాల విలువను గుర్తు చేస్తాయని కొందరు వ్యాఖ్యానించగా.. పెరుగుతున్న జీవన వ్యయం, తగ్గిన ఆదాయ అవకాశాలు మధ్యతరగతి, కార్మిక కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని మరికొందరు అభిప్రాయపడ్డారు. ‘‘ప్రపంచానికి అతడు ఒక క్యాబ్ డ్రైవర్ మాత్రమే కావచ్చు.. కానీ తన కుటుంబానికి మాత్రం నిజమైన హీరో’’ అంటూ పలువురు స్పందించారు.
బెంగళూరు క్యాబ్ డ్రైవర్ జీవిత కథ వైరల్....
