మారుతి సుజుకి తన అత్యంత ప్రజాదరణ పొందిన ఎస్‌యూవీ బ్రెజ్జాను సరికొత్తగా తీర్చిదిద్దుతోంది. దీన్ని త్వరలోనే భారత మార్కెట్లో విడుదల చేయనుంది. అధికారిక ప్రకటన రాకపోయినా టెస్టింగ్‌ సందర్భంగా పలుసార్లు కనిపించిన ఈ వాహనంలో డిజైన్‌తో పాటు ఇంజిన్‌, ఫీచర్లలో కీలక మార్పులు ఉండనున్నట్లు తెలుస్తోంది.

కొత్త బ్రెజ్జాలో ప్రస్తుతం ఉన్న 1.5 లీటర్‌ నేచురల్లీ ఆస్పిరేటెడ్‌ పెట్రోల్‌ ఇంజిన్‌తో పాటు 1.0 లీటర్‌ టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌ కూడా అందుబాటులోకి రానుంది. ఇదే ఇంజిన్‌ను ప్రస్తుతం ఫ్రాంక్స్‌లో ఉపయోగిస్తున్నారు. దీన్ని బ్రెజ్జా కోసం మరింత శక్తిమంతంగా ట్యూన్‌ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

సీఎన్‌జీ వేరియంట్‌లో కూడా పెద్ద మార్పు తీసుకురానున్నట్లు సమాచారం. సిలిండర్‌ను బూట్‌ స్పేస్‌లో కాకుండా వాహనం అడుగు భాగంలో అమర్చనున్నారు. దీంతో లగేజీ పెట్టుకునేందుకు మరింత స్థలం లభిస్తుంది.

ఫీచర్ల పరంగా వెంటిలేటెడ్‌ ఫ్రంట్‌ సీట్లు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఇవి టాప్‌ వేరియంట్లలో అందుబాటులో ఉండే అవకాశం ఉంది. అలాగే పవర్‌ అడ్జస్టబుల్‌ ఫ్రంట్‌ సీట్లు కూడా తొలిసారిగా బ్రెజ్జాలో ఇవ్వనున్నట్లు సమాచారం.