తుంగభద్ర ప్రాజెక్టు నుంచి తెలంగాణకు కేటాయించిన నీటి వాటాపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టతనివ్వాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు డిమాండ్ చేశారు. ఇటీవల కేంద్ర జలశక్తి మంత్రి సి.ఆర్. పాటిల్‌తో జరిగిన చర్చల్లో ఏయే అంశాలను ప్రస్తావించారో వివరాలను బహిర్గతం చేయాలని ఆయన కోరారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

కర్ణాటకలోని హోసపేటలో ఉన్న తుంగభద్ర డ్యామ్‌కు ఇటీవల 33 కొత్త స్పిల్‌వే గేట్లను అమర్చిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ముఖ్యమంత్రులతో పాటు కేంద్ర మంత్రి సి.ఆర్. పాటిల్ హాజరయ్యారు. గేట్ల ఏర్పాటును స్వాగతిస్తున్నామని, అయితే తెలంగాణకు దక్కాల్సిన నీటి కేటాయింపులపై కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాలని రామచంద్రరావు సూచించారు. 

రెండు కీలక ప్రాజెక్టుల కింద తెలంగాణకు 15.9 టీఎంసీల నీరు రావాల్సి ఉండగా, అధికారిక లెక్కల ప్రకారం కేవలం 5 టీఎంసీలు మాత్రమే అందుతున్నాయని, దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి దక్కాల్సిన వాటా కంటే తక్కువ నీటికి గతంలో కేసీఆర్ సంతకం చేశారని ఆయన ఆరోపించారు.

'సర్' ప్రక్రియపై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలను రామచందర్ రావు తీవ్రంగా ఖండించారు. బీజేపీ ఐడీ కార్డు ఉంటేనే 'ఎస్ఐఆర్' చెల్లుతుందా? ‌పాస్‌పోర్ట్ చెల్లదా? అని ఒవైసీ ప్రశ్నించడం విడ్డూరంగా ఉందన్నారు. పాస్‌పోర్ట్ అనేది ట్రావెల్ డాక్యుమెంట్ మాత్రమేనని, అది పౌరసత్వానికి నిరూపణ కాదని 2013లో బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా గుర్తు చేశారు. దలైలామా వద్ద కూడా ఎల్లో పాస్‌పోర్ట్ ఉందని, అంతమాత్రాన ఆయనకు భారత పౌరసత్వం ఉన్నట్లు కాదని పేర్కొన్నారు.