ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తరచూ చేపడుతున్న విదేశీ పర్యటనలను లక్ష్యంగా చేసుకుని బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. ఈ మేరకు 'మిస్సింగ్ రాహుల్ (లాపతా రాహుల్)' పేరుతో సరికొత్త పోస్టర్ ప్రచారాన్ని ప్రారంభించింది. ఆయన పర్యటనల కోసం చేస్తున్న ఖర్చులపై ప్రశ్నలు సంధిస్తూ సామాజిక మాధ్యమాల్లో ఈ క్యాంపెయిన్‌ను ఉద్దృతం చేసింది. 

ఈ ప్రచారంలో భాగంగా పలు సినిమా పోస్టర్లను మార్ఫింగ్ చేస్తూ బీజేపీ నేతలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. "ఛడ్ దే ఇండియా", "రాహుల్ ఇన్ పారిస్", "పరదేశ్" వంటి పేర్లతో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ప్రతిపక్ష నాయకుడి హోదాను 'పర్యటనల నేత'గా మార్చాలని కొందరు బీజేపీ అధికార ప్రతినిధులు ఎద్దేవా చేశారు. ఢిల్లీ బీజేపీ యూనిట్ "స్వదేశ్ వర్సెస్ పరదేశ్" పేరుతో పోస్టర్ విడుదల చేయగా, గోవా బీజేపీ రాహుల్ గాంధీ థాయ్‌లాండ్‌లో విహారయాత్ర చేస్తున్నారా? అంటూ ప్రశ్నించింది.

బీజేపీ నేతలు షెహజాద్ పూనావాలా, ఆర్పీ సింగ్ వంటి వారు రాహుల్ పర్యటనల ఖర్చు, పారదర్శకతపై తీవ్ర ఆరోపణలు చేశారు. రాహుల్ గాంధీ ఇప్పటివరకు సుమారు 55 సార్లు విదేశీ పర్యటనలు చేశారని, వీటికి దాదాపు రూ.60 కోట్లకు పైగా ఖర్చయి ఉండవచ్చని వారు అంచనా వేశారు. ఆయన వెల్లడించిన ఆదాయానికి, ఈ పర్యటనల ఖర్చులకు ఏమాత్రం పొంతన లేదని, ఈ పర్యటనలకు నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయో బహిర్గతం చేయాలని వారు డిమాండ్ చేశారు.

అయితే, బీజేపీ చేస్తున్న విమర్శలను కాంగ్రెస్ పార్టీ అంతే ధీటుగా తిప్పికొట్టింది. రాహుల్ గాంధీ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన నాయకుడని, ప్రపంచవ్యాప్తంగా ఆయనకు ఆహ్వానాలు అందుతుంటాయని పేర్కొంది.

ఇవన్నీ కేవలం రాజకీయ ప్రేరేపిత ఆరోపణలనని కొట్టిపారేసింది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సల్మాన్ ఖుర్షీద్ ఈ విషయంపై స్పందిస్తూ, "రాహుల్ గాంధీ కేవలం మన దేశ నాయకుడే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఆయన్ను గొప్ప నాయకుడిగా భావిస్తారు. అందుకే వివిధ దేశాలు, అంతర్జాతీయ సంస్థల నుంచి ఆయనకు నిరంతరం ఆహ్వానాలు వస్తుంటాయి" అని స్పష్టం చేశారు.