ప్రొటీన్‌ మన శరీరానికి అత్యంత కీలకమైన పోషకాల్లో ఒకటి. కండరాల నిర్మాణం, దెబ్బతిన్న కణజాల మరమ్మతు, హార్మోన్లు, ఎంజైమ్‌ల ఉత్పత్తి, రోగనిరోధక శక్తి పెంపులో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది. శరీరానికి అవసరమైనంత ప్రొటీన్‌ అందకపోతే కొన్ని స్పష్టమైన సంకేతాలు కనిపిస్తాయి. వాటిని నిర్లక్ష్యం చేయకుండా ఆహారపు అలవాట్లను మార్చుకోవడం అవసరం.

ఎప్పుడూ ఆకలి: ప్రొటీన్‌ ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలిగిస్తుంది. భోజనం చేసిన కొద్దిసేపటికే మళ్లీ ఆకలి వేస్తుంటే ప్రొటీన్‌ తక్కువగా తీసుకుంటున్నారనే సంకేతం కావచ్చు.

అలసట: రోజంతా నీరసంగా, బలహీనంగా అనిపించడం కూడా ప్రొటీన్‌ లోపానికి సంకేతమే. శరీరానికి అవసరమైన శక్తి, కండరాల పనితీరు దెబ్బతింటుంది.

కండరాల బలం తగ్గడం: మెట్లు ఎక్కడం, బరువులు ఎత్తడం వంటి సాధారణ పనులు కూడా కష్టంగా అనిపిస్తే కండరాలకు అవసరమైన ప్రొటీన్‌ అందడం లేదని భావించవచ్చు.

జుట్టు రాలిపోవడం: జుట్టులో ప్రధాన భాగం ప్రొటీనే. అందువల్ల దీని లోపం ఉంటే జుట్టు రాలడం, పలచబడడం వంటి సమస్యలు పెరుగుతాయి.

బలహీనమైన గోర్లు: చిన్న దెబ్బకే గోర్లు విరిగిపోవడం, పెళుసుగా మారడం కూడా ప్రొటీన్‌ లోపానికి సూచన కావచ్చు.

గాయాలు మానకపోవడం: కణజాలం పునర్నిర్మాణానికి ప్రొటీన్‌ అవసరం. అందువల్ల గాయాలు లేదా కోతలు త్వరగా మానకపోతే ప్రొటీన్‌ లోపం ఉండే అవకాశం ఉంది.

తరచూ అనారోగ్యం: రోగనిరోధక వ్యవస్థకు ప్రొటీన్‌ కీలకం. ఇది తక్కువగా ఉంటే తరచూ జలుబు, ఇన్‌ఫెక్షన్ల వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది.

గమనిక: ఈ లక్షణాలు ప్రొటీన్‌ లోపం వల్ల మాత్రమే వస్తాయని నిర్ధారించలేం. ఇవి ఇతర ఆరోగ్య సమస్యల వల్ల కూడా రావచ్చు. ఇలాంటి లక్షణాలు తరచూ ఉంటే వైద్యులను సంప్రదించడం మంచిది.