ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌గా మార్చడమే లక్ష్యం అని.. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 'ఫ్రైడే - డ్రైడే' పక్కాగా అమలు చేయాలని అధికారులను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశించారు. ఏపీలో ప్రజారోగ్య పరిరక్షణే అత్యంత ప్రాధాన్యత అంశమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అమరావతిలో తాగునీరు, పారిశుద్ధ్య నిర్వహణ, దోమల నియంత్రణ చర్యలపై ఉన్నతాధికారులతో ఆయన ప్రత్యేక సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. వర్షాకాలం, మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా దోమల నివారణ, అంటువ్యాధుల నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన 'ఫ్రైడే - డ్రైడే' కార్యక్రమాన్ని కేవలం కాగితాలకే పరిమితం చేయకుండా, రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో పక్కాగా అమలు చేయాలని ఆయన స్పష్టం చేశారు.
ఈ పారిశుద్ధ్య విధుల్లో పారదర్శకత పెంచేందుకు ప్రతి శుక్రవారం అధికారులు విధిగా క్షేత్రస్థాయిలో పర్యటించాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. గ్రామాలు, పట్టణాల్లో మురుగు నిల్వలను తక్షణమే తొలగించేలా శాశ్వత ఏర్పాట్లు చేయాలని, దోమల ఉత్పత్తి కేంద్రాలను నిర్మూలించాలని సూచించారు. ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించడంతో పాటు క్రమం తప్పకుండా వీధుల పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టడం స్థానిక సంస్థల కనీస బాధ్యత అని ఆయన గుర్తుచేశారు. రాష్ట్రంలోని అన్ని పంచాయతీల్లో ప్రజారోగ్యానికి ఎలాంటి ఢోకా లేకుండా ముందస్తుగా బ్లీచింగ్ పౌడర్, క్లోరిన్ బిళ్లలను తగిన మోతాదులో ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయి సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ, ప్రజలను కూడా ఈ పారిశుద్ధ్య కార్యక్రమాల్లో భాగస్వాములను చేయాలని, అప్పుడే సీజనల్ వ్యాధుల రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దగలమని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
