బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్' అంతర్జాతీయ స్థాయిలో అరుదైన ఘనతను దక్కించుకుంది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వీక్షణలు పొందిన నాన్-ఇంగ్లీష్ చిత్రంగా ఈ సినిమా రికార్డు సృష్టించింది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ కో-సీఈవో టెడ్ సరాండోస్ వెల్లడించారు.

'ఎక్స్‌ప్రెస్ అడ్డా' కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, , ఈ ఏడాది అమెరికా, యూకే చిత్రాల తర్వాత అంతర్జాతీయంగా అత్యధిక వ్యూస్ సాధించిన చిత్రంగా 'ధురంధర్' నిలిచిందని పేర్కొన్నారు. గణాంకాల ప్రకారం, 2026 జనవరి నుంచి జూన్ మధ్య కాలంలో ఈ సినిమా ఏకంగా 37 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ఏకకాలంలో 22 దేశాల్లో నెట్‌ఫ్లిక్స్ చార్టులలో ఈ చిత్రం అగ్రస్థానంలో నిలవడం విశేషం.

ఆదిత్య ధర్ దర్శకత్వంలో రెండు భాగాలుగా రూపొందిన ఈ ఫ్రాంచైజీ, ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ. 3,100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సత్తా చాటింది. 2025 డిసెంబర్‌లో విడుదలైన మొదటి భాగం ఘనవిజయం సాధించగా, ఈ ఏడాది మార్చిలో వచ్చిన సీక్వెల్ ‘ధురంధర్: ది రివెంజ్’ భారత్‌లో రూ. 1,000 కోట్ల నెట్ వసూళ్లు సాధించిన తొలి బాలీవుడ్ చిత్రంగా చరిత్ర సృష్టించింది.

భారతీయ కంటెంట్‌కు అంతర్జాతీయంగా ఆదరణ విపరీతంగా పెరుగుతోందని టెడ్ సరాండోస్ కొనియాడారు. 2024 నుంచి ప్రతీ వారం ఏదో ఒక భారతీయ సినిమా లేదా సిరీస్ నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ టాప్-10 జాబితాలో స్థానం సంపాదించుకుంటోందని ఆయన గుర్తుచేశారు. 'స్క్విడ్ గేమ్' లేదా 'మనీ హీస్ట్' వంటి భారీ గ్లోబల్ హిట్స్ భారత్ నుంచి ఎప్పుడు వస్తాయని చాలామంది అడుగుతుంటారని, అయితే భారతీయ చిత్రాలు ఇప్పటికే ఆ స్థాయి ఘనతను తరుచూ సాధిస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.