రోడ్డు పనులు చేపట్టే చిన్న కాంట్రాక్టర్లపై మైనింగ్ శాఖ అధికారులు పది రెట్ల వరకు అతిగా పెనాల్టీలు విధించడంపై రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మైనింగ్ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ సచివాలయంలో రహదారుల నిర్మాణం, కాంట్రాక్టర్ల ఇబ్బందులపై జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో వారు మాట్లాడారు. రూ.5 కోట్ల విలువైన అంశానికి ఏకంగా రూ.54 కోట్లు పెనాల్టీ విధించడం అత్యంత దారుణమని, కాంట్రాక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్యకు కారణమైన అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి వివేక్‌ను కోమటిరెడ్డి కోరారు.

 

అక్రమ మైనింగ్ చేసేవారిని వదిలేసి, రోడ్ల పనులు చేసే అమాయక కాంట్రాక్టర్లను ఇబ్బందులకు గురిచేస్తే సహించేది లేదని మంత్రులు హెచ్చరించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హ్యామ్ మోడల్ రోడ్ల పనులను వేగవంతం చేసి, 2028 నాటికి రాష్ట్రంలో అద్దం లాంటి రోడ్లు నిర్మించడమే లక్ష్యమని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. రోడ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుక, మెటల్ పర్మిషన్ల పేరుతో వేధించవద్దని, కాంట్రాక్టర్ల సమస్యలకు తక్షణ పరిష్కారం చూపాలని మైనింగ్ శాఖ అధికారులను మంత్రి వివేక్ ఆదేశించారు.