తన జీవిత భాగస్వామే తన ప్రాణాలకు ముప్పుగా మారిందని ఓ భర్త చేసిన ఫిర్యాదు మహబూబాబాద్‌ జిల్లాలో కలకలం రేపింది. భార్య మొబైల్‌లో కనిపించిన వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ సందేశాలు చూసిన తర్వాత తనను హత్య చేయించే కుట్ర నడుస్తోందని అనుమానించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. అతను అందించిన చాటింగ్‌ వివరాల ఆధారంగా పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

డోర్నకల్‌ మండలం చిలుకోడు గ్రామానికి చెందిన గాదే రాజేశ్వరరావు ప్రస్తుతం ఖమ్మంలో ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తున్నాడు. 2016లో సూర్యాపేట జిల్లా రాఘవాపురానికి చెందిన యువతిని వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

గత నెల 27న మధ్యాహ్నం భోజనం కోసం ఇంటికి వెళ్లిన సమయంలో భార్య మరో వ్యక్తితో చనువుగా ఉండటాన్ని గమనించినట్లు రాజేశ్వరరావు ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీనిపై పెద్దల సమక్షంలో మాట్లాడాలని నిర్ణయించి మరుసటి రోజు తన అన్నను తీసుకొచ్చేందుకు వెళ్లాడు. భార్యతో కనిపించిన వ్యక్తి ఆ సమయంలో తనను వెంబడించినట్లు గుర్తించి పట్టుకునే ప్రయత్నం చేయగా అతను తప్పించుకుని వెళ్లిపోయాడని తెలిపాడు.

అనుమానం మరింత పెరగడంతో భార్య మొబైల్‌ను పరిశీలించానని, అందులో ఉన్న చాటింగ్‌ చూసి షాక్‌కు గురయ్యానని రాజేశ్వరరావు చెప్పాడు. ఇంట్లో చంపొద్దని, బయట యాక్సిడెంట్‌గా కనిపించేలా హత్య చేయాలని భార్య, ఆమెకు పరిచయం ఉన్న పురిమెట్ల సైదులుకు పలుమార్లు మెసేజ్‌లు పంపినట్లు ఆరోపించాడు. వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో జరిగిన సంభాషణల స్క్రీన్‌షాట్లను కూడా పోలీసులకు సమర్పించాడు.

భార్య, ఆమెతో సన్నిహితంగా ఉన్న వ్యక్తి కలిసి తనను హత్య చేసేందుకు కుట్ర పన్నారని ఆరోపిస్తూ ఈ నెల 1న డోర్నకల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి కేసును ఖమ్మం రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌కు బదిలీ చేశారు.

తాజాగా బాధితుడు ఖమ్మం రూరల్‌ పోలీసులను మరోసారి కలిసి పూర్తి వివరాలు అందించాడు. ఫిర్యాదు అందిందని, కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడతామని పోలీసులు తెలిపారు.