భారతదేశంలో నకిలీ కరెన్సీ చలామణిలో నేర ముఠాలు తమ వ్యూహాన్ని మార్చాయి. పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ మద్దతుతో పనిచేసే దావూద్ ఇబ్రహీం నెట్‌వర్క్‌తో సహా ఇతర సిండికేట్లు, ఇప్పటివరకు రూ.500 వంటి పెద్ద నోట్లను లక్ష్యంగా చేసుకున్నాయి. అయితే, ఇప్పుడు తమ దృష్టిని రూ.10, రూ.20, రూ.50 వంటి తక్కువ విలువ కలిగిన నోట్లపైకి మళ్లించాయని భారత భద్రతా సంస్థలు గుర్తించాయి. మార్కెట్లోకి ఈ చిన్న నకిలీ నోట్లను భారీగా చలామణిలోకి తెచ్చి, భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలనేది వారి ప్రణాళికగా తెలుస్తోంది. 'నకిలీ భారత కరెన్సీ నోట్ల' (ఎఫ్ఐసీఎన్‌) చలామణిని అరికట్టేందుకు అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్న వేళ, ఈ కొత్త ధోరణి వెలుగులోకి వచ్చింది.

భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) విడుదల చేసిన 2025-26 వార్షిక నివేదిక ప్రకారం.. బ్యాంకింగ్ వ్యవస్థలో గుర్తించిన మొత్తం దొంగనోట్ల సంఖ్య 5.7 శాతం పెరిగింది. ముఖ్యంగా రూ.20 నకిలీ నోట్ల గుర్తింపు ఏకంగా 47.4 శాతం మేర పెరగడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు అత్యధికంగా చలామణిలో ఉన్న రూ.500 నకిలీ నోట్లు ఇప్పటికీ అధిక సంఖ్యలోనే పట్టుబడుతున్నాయి. అయితే, రూ.100, రూ.50 నకిలీ నోట్ల సంఖ్యలో కొంత తగ్గుదల కనిపించగా, ఇప్పటికే రద్దయిన రూ.2000 నకిలీ నోట్ల చలామణి గణనీయంగా క్షీణించింది.

ఈ పరిణామాల నేపథ్యంలో ఆర్బీఐ అప్రమత్తమైంది. నకిలీ నోట్లను గుర్తించే పద్ధతులపై బ్యాంకుల్లో నగదు నిర్వహణ సిబ్బందికి నిర్దేశిత గడువులోగా శిక్షణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా సరిహద్దు జిల్లాల్లోని బ్రాంచ్‌లకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది. నకిలీ నోట్లను గుర్తించి, స్వాధీనం చేసుకోవడంలో విఫలమైతే, నోటు విలువను బట్టి జరిమానాలు ఉంటాయని హెచ్చరించింది. ఇటీవల దేశంలోని పలు రాష్ట్రాల్లో జరిగిన దాడుల్లో పెద్ద, చిన్న విలువ కలిగిన నకిలీ నోట్లు పట్టుబడగా, స్థానిక నెట్‌వర్క్‌ల ద్వారా వీటిని ముద్రిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నెట్‌వర్క్‌లను అరికట్టేందుకు నిఘాను ముమ్మరం చేసినట్లు దర్యాప్తు సంస్థలు తెలిపాయి.