ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫేస్‌బుక్ పోస్ట్‌ను కొద్దిసేపు నిలుపుదల చేసిన ఘటనపై సోషల్ మీడియా దిగ్గజం మెటాతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపనుంది. విధానపరమైన, సాంకేతిక అంశాలపై చర్చించేందుకు వారంలోగా మెటా ప్రతినిధులు రానున్నారని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ కార్యదర్శి ఎస్. కృష్ణన్ గురువారం తెలిపారు.
పరీక్ష పత్రాల లీకేజీపై కఠిన చర్యలు తీసుకుంటామని యువతను ఉద్దేశించి ప్రధాని మోదీ జులై 23న ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్ట్‌ను మెటా కొద్దిసేపు నిలిపివేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత 'సాంకేతిక లోపం' కారణంగా జరిగిందని పేర్కొంటూ క్షమాపణ చెప్పి, పోస్ట్‌ను పునరుద్ధరించింది. అయితే, ఈ వివరణతో కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ సంతృప్తి చెందలేదు. ఈ నేపథ్యంలోనే మెటా పబ్లిక్ పాలసీ హెడ్‌కు సమన్లు జారీ చేసింది.
ఈ అంశంపై ఎస్. కృష్ణన్ మాట్లాడుతూ.. "ఈ ఘటనకు దారితీసిన కారణాలను వివరించడానికి తమ ఉన్నత స్థాయి బృందాన్ని పంపాలని మెటాను కోరాము. వారంలోగా వారు వచ్చి వివరణ ఇస్తారు. ఈ విషయంలో విధానపరమైన, సాంకేతిక పరమైన అంశాలను పూర్తిగా అర్థం చేసుకోవాలనుకుంటున్నాం. భారత్ ఆందోళనలకు అనుగుణంగా వారు వ్యవహరించాల్సి ఉంటుంది. చర్చించేందుకు మా వద్ద చాలా అంశాలున్నాయి" అని స్పష్టం చేశారు.
ఈ ఘటన తర్వాత, ప్రధాని మోదీతో పాటు ఇతర ప్రముఖుల ఖాతాల విషయంలో కఠినమైన, మెరుగైన భద్రతా ప్రమాణాలను అమలు చేసినట్లు మెటా కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసినట్లు సమాచారం. ఇకపై ఇలాంటి ఖాతాలపై ఏదైనా చర్య తీసుకునే ముందు, కనీసం ఇద్దరు సీనియర్ అధికారుల బృందం సమీక్షించాల్సి ఉంటుందని మెటా తన నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది.
ప్రధాని మోదీ ఫేస్‌బుక్ పోస్ట్ కొద్దిసేపు నిలుపుదలపై మెటాతో చర్చించనున్న కేంద్రం..
